23, జులై 2025, బుధవారం

చారీజీ 98 వ జయంతి సందర్భంగా దాజీ సందేశం



చారీజీ 98 వ జయంతి సందర్భంగా దాజీ సందేశం 

 

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం - ప్రథమ దర్శనం

 


పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం - ప్రథమ దర్శనం 



గురువుతో మొట్టమొదటి కలయిక చాలా అద్భుతమైనది అందరికీ. ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోయేది. ప్రతి సాధకుడికి ఇటువంటి అద్భుత మధుర క్షణం వస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ఒక్కొక్కరికీ ఒక్కొక్క ప్రత్యేక అనుభూతి కలుగవచ్చు. ఉదాహరణకు స్వామి వివేకానంద మొట్టమొదట సారి శ్రీరామకృష్ణుల వారిని కలవడం; బాబూజీ మహారాజ్ తన గురుదేవులైన లాలాజీ మహారాజ్ ను మొట్టమొదటిసారి దర్శించడం; పూజ్య చారీజీ బాబూజీతో మొదటి కలయికను ఎంత అద్భుతంగా వర్ణించారో మనం చదివ్యయం. అలాగే పూజ్య దాజీ కూడా వారి సరళమైన కానీ దివ్యమైన అనుభవాన్ని మనతో పంచుకోవడం కూడా చూశాం. ఆ మొట్టమొదటి కలయికలోనే చాలా వరకూ జరుగవలసిన ఆధ్యాత్మిక కార్యం బీజరూపంలో నిక్షిప్తం అయిపోతుందని, నా విశ్వాసం; రానున్న కాలంలో ఆ బీజమే మొలకెత్తి వృక్షమయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి సాధకుడికి గురువుతో కలయిక మళ్ళీ మళ్ళీ తలచుకునేంత నిగూఢ క్షణం; ఎంతో జ్ఞానం ఊరుతూ ఎ సమయానికి ఆ సమయం లక్ష్యం దిశగా అవసరమైన వివేకాన్ని అందించేటువంటి అద్భుత క్షణం. 

పూజ్య చారీజీ 1964 లో ఆయన మొట్టమొదటి సారి బాబూజీతో కలయికను, మై మాస్టర్ గ్రంథంలోనూ, ఎన్నోసార్లు తన ప్రసంగాల్లోనూ ఉల్లేఖించడం చూశాం; ఎన్నో విషయాలు గ్రహించాం, గ్రహిస్తూనే ఉన్నాం. 

పూజ్య గురుదేవుల ప్రథమ దర్శనం 
నేనంతకు పూర్వం ఎందరో మహాత్ములను చూడటం జరిగింది. అందరి వద్ద స్ఫూర్తి-ప్రేరణాలు కలుగుతూనే ఉన్నాయి. కానీ యేదో వెలితి, యేదో వ్యక్తం చేయలేని లోటు. నాకు సహజ్ మార్గ్ సాధనను పరిచయం చేసిన ప్రశిక్షకులు, నన్ను సాధ్యమైనంత త్వరగా పూజ్య చారీజీని కలవమని సలహా ఇచ్చారు గాని నా మనసుకు పెద్దగా ఎక్కలేదు. అయితే నేను మార్చ్ 1990 లో ప్రారంభించాను, ఏప్రిల్ 30 న జైపూర్ లో బాబూజీ భండారా. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్యాలస్ లోకి, పూజ్య చారీజీ వస్తున్నారని తెలిసి అందరూ నిరీక్షిస్తున్నారు; నేను కూడా వేచి ఉన్నాను; ఎటువంటి అపేక్ష లేకుండా; మరో మహాత్ముడిని చూస్తున్న ఆరాటం తప్ప యేమీ లేదు. ఒక కుర్చీ వేసి ఉంచారు అక్కడ ఆయన కోసం. అందరమూ క్రింద కూర్చొని ఉన్నాం. తక్కువ మందే ఉన్నారు. 

కాస్సేపటికి ఆ మహానుభావుడు రానే వచ్చాడు. అదే మీదటి సారి చూడటం; వినడం. 6 అడుగులు, దివ్య తేజస్సు; ఆజానుబాహుడు; మనిషి మొత్తం ప్రకాశిస్తున్నారు; పైన చిత్రంలో ఉన్నట్లుగా చూశాను కానీ గడ్డం అవీ లేవు; కళ్ళల్లో ఒకరకమైన కొంటెతనం; మేధను సూచిస్తూ విశాలమైన నుదురు; మొత్తంగా దివ్యమంగళ విగ్రహం అన్నట్లుగా చూపు తిప్పుకోలేని మహాపురుషుని దర్శనం. ఇక మనసులోకి తొంగి చూసుకుంటే, అపరిమితమైన అలౌకిక ఆనందం; లక్ష ప్రశ్నలకు ఒకేసారి సమాధానం వచ్చినట్లు; పిచ్చ నిశ్శబ్దం; శాశ్వత ముద్ర కానీ ముద్ర పడిపోయింది.  యేదో సాధించేసిన తెలియని గర్వం; మా మధ్య యేమీ సంభాషణ జరగలేదు. అసలు ఆ అవసరం రాలేదు. ఆంగ్లంలో యూరేకా మూమెంట్ అంటారు. ఇక నేను చేరవలసిన చోటుకు క్షేమంగా చేరుకున్నాను; ఇక గురువు అన్వేషణ అవసరం లేదు అన్న గొప్ప ఆత్మ విశ్వాసం కలిగింది.
 
ఆ తరువాత నా తపన చాలా వరకూ చల్లారింది; కానీ ఒక కొత్త తపన ప్రారంభమయ్యింది. వారిలో అణుమాత్రంగానైనా తయారయ్యే ప్రయత్నం చెయ్యాలి అన్న తపన. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. వారి జీవిత కాలంలో పూర్తికానీ నా ఈ ఆధ్యాత్మిక యాత్రను ఎంతో అనుగ్రహంతో వారి వారసులైన పూజ్యశ్రీ దాజీ గారికి అప్పగించడం జరిగింది. పూజ్య గురుదేవులైన దాజీ మార్గదర్శనంలో నా యాత్ర ఇలా కొనసాగుతూ ఉంది. 

ఇంకా ఉంది ... 


22, జులై 2025, మంగళవారం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం


పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం

ఈ నెల జూలై 24, 2025 న పూజ్య గురుదేవుల 99వ  జన్మదినోత్సవం. 98వ జయంతి. ఈ సందర్భాన వారి ప్రత్యేక స్మరణలో వారితో నా ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని గురించి, కొన్ని అక్షరాల ద్వారా క్లుప్తంగా పునర్జీవించాలన్న సంకల్పం కలిగింది. ప్రయత్నిస్తాను.   

ఆధ్యాత్మిక సత్యాన్వేషణలో ఉన్న మామూలు సాధకుడు, దేని కోసం వెతుకుతున్నాడో , దేని కోసం తపిస్తున్నాడో కూడా స్పష్టంగా అవగాహన లేకుండా వెతుకుతున్న రోజుల్లో, తటస్థమైన మహాత్ములందరి సాంగత్యంలో పాల్గొనే ప్రయత్నం చేసేవాడిని. గుడులు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, తటస్థమైన ధ్యాన పద్ధతులు, సైంటిస్టులను, నోబెల్ పురస్కార గ్రహీతలను వివిధ ఆధ్యాత్మిక సంస్థలను, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సందర్శిస్తూ ఉండేవాడిని; ఇదంతా ఊహందుకున్నప్పటి నుండి. అయినా యేదో తెలియని వెలితి; అందరి వద్ద మంచే నేర్చుకున్నాను; దేనికీ వంక పెట్టడానికి లేదు; అయినా యేదో తీరని ఆకలి; పైగా ఆకలి తీవ్రత పెరిగింది. మనసులో సమాధానాల్లేని అనేక ప్రశ్నలు; తీవ్ర అశాంతి; ఎవరికీ చెప్పుకునేది కాదు; ఇతరులకు ఇది పెద్ద సమస్య కాదు; నాకు చాలా పెద్ద సమస్యలా ఉండేది.  

మరో ప్రక్క చదువు, వగైరావన్నీ నిర్లిప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కువగా ఏకాంతంగా గడపటానికి ఇష్టపడేవాడిని. విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటయ్యింది. తపన మరింత తీవ్రం అయ్యేది. 

కొన్ని సంవత్సరాలకు, నన్ను యేదో తెలియని శక్తి నడిపిస్తున్నదన్న ప్రగాఢ అనుభూతి కొనసాగుతూ ఉండేది; ఎవరికైనా చెప్తే నమ్మరు, పైగా హేళన చేస్తారన్న భయం ఉండేది. గుప్తంగా ఆ అనుభూతి యొక్క సత్యం నాలోనే ఉంచుకున్నాను; నాకు మాత్రమే తెలుసు. 1986 లో శ్రీ రామ కృష్ణ మఠంలో, ఆ సంస్థ అధ్యక్షులయిన స్వామి గంభీరానందజీ వద్ద గురుదీక్ష తీసుకోవడం జరిగింది. మనసు కొంత ఊరడిల్లింది. 4 సంవత్సరాలకు వారు మహాసమాధి పొందడం జరిగింది. ఆ క్షణం నుండి మరలా నా మనసు అగాథంలో ఉన్నట్లుగా తీవ్ర వ్యధకు గురయ్యింది. దీని ప్రభావం ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఏమి చేయాలో తెలియక మండల కాలం స్వామి అయ్యప్ప దీక్ష తీసుకున్నాను. 80 కి.మీ. లు నడిచి మకరజ్యోతిని దర్శించాను. తనువు పులకరించింది. తిరిగి వచ్చిన తరువాత శ్రీరామ చంద్ర మిషన్ సభ్యులు ఒకాయన పరిచయం అయ్యాడు. కానీ ఆయనతో నేను బాగా వాదించేవాడిని. ఆయన కూడా అలాగే ఉండేవాడు. కానీ సాంగత్యం నచ్చింది. కానీ ఈ సంస్థలో చేరాలన్న ఆలోచన యే కోశాన లేదు.

తదుపరి వ్యాసం గురుదేవుల ప్రథమ దర్శనం ...  

 

7, జులై 2025, సోమవారం

ఆధ్యాత్మిక గ్రంధాలలో " ధ్యానానికి వున్న విశిష్టత

 ఆధ్యాత్మిక గ్రంధాలలో " ధ్యానానికి వున్న విశిష్టత

శ్లోకం

పూజకోటి సమం స్తోత్రం,   

 స్తోత్రకోటి సమో జపః

 జపకోటి సమం ధ్యానం ,         

 ధ్యానకోటి సమో లయః

భావం:

కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం,

కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం,

కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం,

కోటి ధ్యానాదులు ఒక లయానికి సమానం.

- శ్రీ కృష్ణ భగవానుడు, ఉత్తర గీత  

శ్లోకం

నాస్తి ధ్యాన సమం తీర్థం;   

 నాస్తి ధ్యాన సమం తపః| 

 నాస్తి ధ్యాన సమో యజ్ఞః 

 తస్మాద్యానం సమాచరేత్

భావం:

ధ్యానంతో సమానమైన తీర్ధం కానీ , ధ్యానంతో సమానమైన తపస్సు కానీ ధ్యానంతో సమానమైన యజ్ఞాలు కానీ లేవు , అందువలన | అన్నింటికన్నా ఉత్తమమైన ధ్యానం తప్పక అభ్యసించాలి. 

- శ్రీ వేదవ్యాస మహర్షి 

గురుపూర్ణిమ

 

గురుపూర్ణిమ

ఈ సంవత్సరం  జూలై 10, 2025 తేదీన గురుపూర్ణిమ అయ్యింది. ప్రతీ  సంవత్సరమూ ఆషాఢ  పూర్ణిమ నాడు,  వేదవ్యాస  మహర్షి  జన్మదిన  సందర్భంగా  ఈ  రోజును  గురుపూర్ణిమగా  భారతీయ  సాంప్రదాయంలో  అనాదిగా  జరుపుకుంటూ  వస్తున్నారు.  వేదవాజ్ఞ్మయాన్ని అంతటినీ  క్రోడీకరించి,  ఒక్కచోటుకు  జేర్చిన మహాత్ముడు,  మహర్షి వ్యాసమహర్షి.  వీరి  జన్మదినాన  అన్ని  సాంప్రదాయాలకు  సంబంధించినవారు,  శిష్యులందరూ  కూడా వ్యాసమహర్షిని  స్మరించుకుంటూ తమతమ  గురుపరంపరను తమ  గురుదేవులను పూజించుకోవడం  ద్వారా ఇది  జరుగుతూ ఉంది.  

ఈ  రోజున  వివిధ  సాంప్రదాయాలకు  సంబంధించినవారు, వారి-వారి  సంప్రదాయాలకనుగుణంగా వివిధ రకాలుగా  ఈ  పవిత్ర దినాన్ని  జరుపుకుంటూ  ఉంటారు. ఈ  రోజున  గురువుతో  భౌతికంగా  కూడి  ఉండగలిగినప్పుడు  సాధకుడి  ఆధ్యాత్మిక  పురోగతి  ఎన్నో  ఇంతలు  త్వరితంగా గురువు  అనుగ్రహం  చేత జరిగే  అవకాశం  ఉందని  చెప్తారు. 

హార్ట్ఫుల్నెస్,  శ్రీరామచంద్ర  మిషన్ సంప్రదాయంలో గురుపూర్ణిమ

కాని  ఈ  సంస్థలో  అది సాధకుడు  లేక  అభ్యాసి అంతరంగ  తయారీని  బట్టి,  ఆతని  అంతరంగ  స్థితిని  బట్టి,  అతని తపనను  బట్టి  ఆధారపడుంటుందని  చెప్తారు  మన  గురువులు.

ఉత్తర్  ప్రదేశ్ లోని షాజహానుపూరుకు  చెందిన శ్రీరామచంద్రజీ,  ఆప్యాయంగా  పిలుచుకొనే  బాబూజీ  స్థాపించిన శ్రీరామచంద్ర  మిషన్ లో,  ఈ  సంప్రదాయంలోని  గురుపరంపర యొక్క గురువులు, గురుపూర్ణిమ ప్రతీ  సంవత్సరం  ఒక  ఆచారంలా  ఒక క్రతువులా  చెయ్యద్దంటారు.  ఈ  సంప్రదాయం  వాటన్నిటికీ  అతీతంగా  చాలా  దూరంగా  ప్రయాణించిన  సంస్థ  అంటారు.  యాదృచ్ఛికంగా అంటే  అనుకోకుండా మనం  ఆ  రోజున  గురువుతో  కూడి  ఉన్నట్లయితే  అది  వేరే  విషయం,  కాని  ఆ  రోజున  ప్రత్యేకంగా  గురువుతో  ఉండాలని  ప్రణాళిక  అవసరం  లేదంటారు. దానికి  బదులుగా ఆ రోజున, అభ్యాసి  లేక  సాధకుడు  ఎక్కడున్నా తన  గురుదేవుల  స్మరణలో  ఎంతగా  లీనమైపోయి  ఉండటానికి  ప్రయత్నించాలంటే  ఆ  స్మరణలో  సాధకుడు  ఆహుతి  అయిపోవాలంటారు. "Consume yourself in His remembrance" అంటారు. 

స్మరణ  అంటే  మళ్ళీ  కేవలం  జ్ఞాపకాలు  కావు.  ఆ  జ్ఞాపకాలు  ఎలా  ఉండాలంటే  మనం  స్మరిస్తున్న  వ్యక్తి లేక  గురువు  సాక్షాత్తు  మనతో  ఆయన  ఉనికి  ఉన్నట్లుగా  అనుభూతి  చెందగలగాలి. వారి  ఉనికిని అనుభూతి  చెందుతూ,  వారు  గడిపిన  జీవన  విధానాన్ని,  వారు  సాధన చేసిన  విధానాన్ని,  వారి  క్రమశిక్షణ, వారి  వ్యక్తిత్వం,  వారి  ఆధ్యాత్మిక  సాన్నిధ్యాన్ని... వీటన్నిటినీ  స్మరిస్తూ వారి  ఉనికిని  నిజంగా  అనుభూతి  చెందే  ప్రయత్నంలో  ఉంటూ  మన జీవితం  ఎంత  వరకూ  దీనికి  దగ్గరగా  ఉంది అని  ఆత్మావలోకనం  జరిగినప్పుడు  కనీసం మనం  చేసుకోవలసిన  సవరణలు  ఏమిటో  అయినా  మనకు  తెలిసే  అవకాశం  ఉంటుంది.  

కావున  ఈ  పరమపవిత్ర  దినాన  అభ్యాసులుగా  మనందరమూ  గురువుల  అభీష్తాన్ని  అనుసరించి తమ  గురుదేవుల  దివ్యస్మరణలో తమను  తాము  ఆహుతి  చేసుకోగలరని  ప్రార్థిస్తూ.... 

గురుపూర్ణిమ - గురుదేవుల  దివ్య స్మరణలో మనలను  మనం ఆహుతి చేసుకోవడమే  గురు పూర్ణిమనాడు  సాధకుడు  చెయ్యవలసినది.

2, జులై 2025, బుధవారం

Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం - 3

 


Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం - 3

అద్భుతం ఏమిటంటే - ఈ గ్రంథం యే విధంగా చదవాలి? బ్రైటర్ వరల్డ్ లో ఉండే మహాత్ములు, ఇక్కడుండే ఇతర ఆత్మల స్వభావం ఎలా ఉంటుంది? ఇక్కడి వాతావరణం ఎలా ఉంటుంది?  ఇత్యాది ప్రశ్నలన్నీటికీ కూడా మనకీ గ్రంథ శ్రేణిలోనే లభిస్తాయి. ఇవి గాక మన మాస్టర్లు తరచూ ఇచ్చే సమాధానాలున్నాయి. 
క్లుప్తంగా ఈ గ్రంథం ఎలా చదవాలి?
ధ్యానస్థితిలో చదవాలి. సాధ్యమైనంత వరకూ ఉదయం ధ్యానం తరువాత చదవాలి. ఎందుకంటే అప్పుడు తాగా ధ్యాన చేసిన తరువాత ధ్యానస్థితిలో ఉంటాం కాబట్టి. అప్పుడు పంక్తుల్లో ఉండే అర్థమే గాక పంక్తుల మధ్య అదృశ్యంగా ఉండే అర్థాలు కూడా అర్థం చేసుకునే విధంగా చదవాలంటారు బాబూజీ విస్పర్శ్ లో. 
ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది?
ఈ గ్రంథం ప్రకారం, ఇక్కడ భూమ్మీద ఒకప్పుడు అవతరించి ఎన్నో మహత్కార్యాలు చేసిన మహాపురుషులందరూ ఉంటారు. వీళ్ళు గాక బ్రైటర్ వరల్డ్ దాటి, ఇంకా ఆవల ఉన్న ఎందరో ఇంకా అవతరించని మహాత్ములు కూడా ఉంటారు. వీరందరూ గాక ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థితులను పొంది ఇక్కడ ఉండటానికి యోగ్యతను సంపాదించుకున్న ఆత్మలు కూడా ఉంటాయట. ఇప్పటికే ఎందరో అటువంటి అభ్యాసులు కూడా ఇక్కడున్నారని విస్పర్శ్ గ్రంథం చెబుతోంది. అద్భుతమైన విషయం ఏమిటంటే ఇక్కడున్నవారందరూ ఒక్కటిగా, ఎటువంటి బేధాభిప్రాయాలూ లేకుండా ఒకే దిశగా పని చేయడం; ముఖ్యంగా భూగ్రహంపై  ఉన్న మానవాళి వికాసం కోసం, ఆ ఎగ్రెగోర్ సాధించే వరకూ వారు వాళ్ళ వాళ్ళ లోకాలను వదిలి ఇక్కడ కలిసిగట్టుగా పలు విధాలుగా పని చేస్తున్నారు. అందులో భాగమే ఈ సందేశాలను ప్రసరించడం కూడా. ప్రపంచ చరిత్రలోనే ఇన్ని వేల సందేశాలను, అది కూడా మానవాళి శ్రేయస్సును ఉద్దేశించినవి అందుకోవడం ఇదే మొదటిసారి. 
వీళ్ళందరూ నివసిస్తున్న లోకాన్ని చిత్రించడం అంతా తేలికైన విషయం కాదు.ఈ దివ్యలోకంలో కోరిక, అసూయ, ద్వేషం అనేవి అస్సలుండవు. సోదరభావం, ఓరిమి, సమగ్రమైన అవగాహన అనేవి ప్రేమకు ఆలాపనగా ఉంటాయి. పరపూర్ణత కోసం మాలో అన్వేషణ శాశ్వతంగా ఉంటంది. దివ్యత్వంతో ఏకమై  ఉండిపోవాలన్న పవిత్ర స్ఫూర్తి మాలో కణకణాల్లో నిండుగా ఇమిడి ఉంటంది. మేము ఒకే సూక్ష్మ శక్తితో ప్రకంపిస్తూ ఉంటాం. ఒక శాశ్వతమైన స్వర్గతుల్యమైన స్వరం మాలో నుండి వచ్చే  గీతాలను ఒక్కటి చేస్తుంది. మేమందరమూ ఒక్కటిగా ప్రేమిస్తూంటాం.  యే స్థానంలోనైనా కేవలం అక్కడ ఉండే సౌందర్యాన్ని, పవిత్రతను మాత్రమే చూస్తాం. 

మన మానవ సోదరులందరూ లేక ఇతర లోకాల్లో పరిణతి చెందుతున్నవారందరూ కూడా, ఇంచుమించుగా సహించలేని జీవన విధానాలకు గురవుతూ ఉన్నంతవరకూ, వాళ్ళు తమ శృంఖలాల నుండి విముక్తులయ్యే వరకూ, ఈ దివ్యలోకంలో ఉండే దివ్య అద్భుతాలను నిజంగా వాళ్ళు అనుభవించలేరు.

(ఇంకా ఉంది ... )

1, జులై 2025, మంగళవారం

Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం - 2

  


Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం - 2  

*

బ్రైటర్ వరల్డ్ కు, సాధకులకు మధ్య వారధిగా వ్యవహరించిన మన లేఖిని శ్రీమతి హెలీన్ పైరే ఆ దివ్యలోకం నుండి ప్రకంపనల రూపంగా అందుకున్న సందేశాలను ఫ్రెంచ్ భాషలోకి తర్జుమా చేసి, ఆ తరువాత వాటిని ఆంగ్లంలోకి సోదరుడు మిచేల్ అనువదించడం జరిగింది. ఈ సందేశాల సంకలనానికి పూజ్య గురుదేవులు చారీజీ మహారాజ్ 2005 వ సంవత్సరంలో విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అని నామకరణం  చేయడం జరిగింది. ఈ గ్రంథాన్ని గురించిన మరిన్ని వివరాలుఈ క్రింది లింకుల ద్వారా తెలుసుకోగలరు.   

విస్పర్స్  ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 1 - ఛానలింగ్

https://hrudayapatham.blogspot.com/2021/12/1.html

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ -  2 - గ్రంథ పరిచయం

https://hrudayapatham.blogspot.com/2021/12/2.html

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 3 - చారీజీ భావాలు

https://hrudayapatham.blogspot.com/2022/01/3.html

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 4- (విస్పర్ సందేశాలను చదివే విధానం)

https://hrudayapatham.blogspot.com/2022/07/4.html

మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అనుభూతులు  - విస్పర్స్ సందేశాల నుండి బాబూజీ

https://hrudayapatham.blogspot.com/2024/03/blog-post_2.html

మృత్యువు - విస్పర్స్ సందేశాల నుండి బాబూజీ

https://hrudayapatham.blogspot.com/2024/03/blog-post_6.html


(ఇంకా ఉంది ... )

 


చారీజీ 98 వ జయంతి సందర్భంగా దాజీ సందేశం

దాజీజూలై భండారా సందేశం చారీజీ 98 వ జయంతి సందర్భంగా దాజీ సందేశం