(సప్తపది)
వివాహ వ్యవస్థ - 3
వివాహ వ్యవస్థలో, సనాతన ధర్మం ప్రకారం రకరకాలుగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. అతి ప్రసిద్ధమైన అందరూ సాధారణంగా అనుసరించే పద్ధతులు - మాంగల్య ధారణం, పాణిగ్రహణం, కన్యాదానం, సప్తపది, వీటిల్లో ఏదోక తంతు అయినా ఉంటుంది లేక అన్నీ కలిసి కూడా వివాహ మహోత్సవం జరుపుకుంటూ ఉంటారు.
మాంగల్యధారణంలో , వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేయడం జరుగుతుంది; మూడు ముళ్ళకర్థం: స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు సంకేతం ఈ మూడు ముళ్ళు. మూడు శరీరాలలోనూ ఇరువురూ ఒక్కటిగా ఉండాలన్నది ఆశయం.
పాణిగ్రహణంలో వధువు చేయి, వరుడు చేతిలో పెట్టడం జరుగుతుంది. హార్ట్ఫుల్నెస్ సాంప్రదాయంలో సజీవ గురువు, గురుదేవులు, మాస్టర్, సాన్నిధ్యంలో వధూవరులు, పూలదండలు మార్చుకున్న తరువాత (ముందుగా వధువు వరుడి మెడలో దండ వేస్తుంది, ఆ తరువాత వరుడు వధువు మెడలో దండ వేయడం జరుగుతుంది) వరుడు చేతిలో వధువు చేయి ఉంచి ఆశీర్వదించడం జరుగుతుంది. జీవితాంతం అలా ఒకరికొకరు కొనసాగాలని, వరుడు, వధువును ఆ విధంగా చూసుకోవాలని అర్థం. ఒక మహాత్ముని సమక్షంలో పాణి గ్రహణం చేయడం అనేది ఇరువురికీ అమితమైన బాధ్యతను సూచిస్తుంది.
కన్యాదానం అంటే వధువు యొక్క తల్లిదండ్రులు తమ కుమార్తెను, కన్యను, వరుడిని మహావిష్ణువుగా భావించి, అంటే భగవంతునిగా భావించి తాము అపురూపంగా పెంచిపెద్దచేసిన కన్యను, అపరిమితమైన విశ్వాసంతో ఆయన చేతిలో పెట్టి, అప్పుడప్పుడు వరుడి కాళ్ళు కడిగి (భగవంతుని పాదాలుగా భావించి), దానం చేయడం జరుగుతుంది.
సప్తపది అనే నాల్గవ తంతులో అగ్నిహోత్రుని చుట్టూ, అగ్నిసాక్షిగా వధూవరులిద్దరి చేత, అన్యోన్య దాంపత్యానికి అవసరమైన ఏడు వాగ్దానాలు, చేయిస్తారు. కలిసి ఏడు అడుగులు వేస్తూ, అందుకే వీటిని సప్తపది అంటారు అంటే ఏడు అడుగులు వేస్తూ ఈ ప్రమాణాలు చేస్తారు. వీటినే పెళ్ళినాటి ప్రమాణాలు అని కూడా అంటారు.
ఆ విధంగా వివాహ వ్యవస్థ ఒక పవిత్ర వ్యవస్థ, మానవ సమాజాన్ని క్రమశిక్షణలో ఉంచుతూ మనుగడకు ఉపయోగపడే మహత్తరమైన వ్యవస్థ.
ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడూ, ఇది ఆలుమగలు పరిశుద్ధ ప్రేమతత్త్వాన్ని పెంపొందించుకునే అద్భుత వ్యవస్థ. తద్వారా ఆత్మసాక్షాత్కార దిశగా లేక భగవత్సాక్షాత్కార దిశగా తీసుకువెళ్ళేటువంటి పవిత్ర వ్యవస్థ. ప్రేమ, త్యాగాలను అనుభవపూర్వకంగా శిక్షణనిచ్చే వ్యవస్థ. రోజు-రోజుకూ మరింత మెరుగైన మానవుడిగా మారడానికి అనువైన, వీలుకల్పించే శిక్షణాస్థలి, అద్భుత అవకాశం. ఇతరులను గురించి ఆలోచింపజేసే ఆశ్రమం గృహస్థాశ్రమం.
adbhutam.
రిప్లయితొలగించండి