27, నవంబర్ 2023, సోమవారం

కాన్హా శాంతి వనంలో ఇద్దరు మహాదిగ్గజాల కలయిక (ఆదివారం, నవంబర్ 26, 2023 )

 

పూజ్య దాజీ గౌరవ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారిని గౌరవించుట  


ఇద్దరు మహాదిగ్గజాల ఆత్మీయ సంభాషణ 


గద్గద స్వరంతో స్వాగటిస్తున్న సోదరి దర్శ్విందర్  

కాన్హా శాంతి వనంలో ఇద్దరు మహాదిగ్గజాల కలయిక  
(ఆదివారం, నవంబర్ 26, 2023)

ఎన్నో రోజుల నుండి నిరీక్షిస్తున్న ఘడియ రానే వచ్చింది - భారత ప్రధాన మంత్రి కాన్హా శాంతి వనానికి ఆయన రాక. ఆదివారం, నవంబర్ 26, 2023 న ఉదయం సుమారు 10:30 గంటలకు కాన్హా శాంతి వనం, హార్ట్ఫుల్నెస్ ప్రధాన కార్యాలయానికి వారు విచ్చేయడం, పూజ్య దాజీ వారికి ఆతిథ్యం ఇవ్వడంలో భాగంగా, ఆశ్రమం అంతటా ఒక చిన్న పర్యటన చేయించడం అన్నీ జరిగాయి. 

దైవప్రణాళికకు, గురుపరంపరకు, అనుగుణంగా వ్యవహరిస్తూ, మానవాళికి నేతృత్వం వహిస్తున్న  భూమ్మీద ఉన్న ఈ ఇద్దరు మహాదిగ్గజాలు - పూజ్య దాజీ, గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వేదిక మీద కలిసి ప్రవేశిస్తున్నప్పుడు, ఆ అద్భుత దృశ్యాన్ని చూసి, అక్కడున్న అభ్యాసులందరూ  పులకరించిపోయారు, పరవశించిపోయారు.  ఆనంద భాష్పాలు చాలామంది కళ్ళల్లో  గమనించడం జరిగింది.  సంధానకర్తగా   అద్భుతంగా వ్యవహరించిన మన ప్రిసెప్టర్ సోదరి దర్శ్విందర్ కూడా అనిర్వచనీయమైన ఆనందంతో, కళ్ళల్లో నుండి వస్తున్న నీరు కనిపించకుండా  గద్గద  స్వరంతో మన ప్రధానికి హృదయపూర్వక స్వాగతం పలికింది. ఆమె పలికిన పలుకులు కూడా ఆ వాతావరణానికి తగినట్లుగా మనసుకు హాయి కలిగించే విధంగా ఉన్నాయి. ప్రధానిని కీర్తిస్తూనే బాహ్య స్వచ్ఛతతోపాటు అంతరంగ స్వచ్ఛత కూడా తోడైతే ఇంకా బాగుంటుంది కదా అని హార్ట్ఫుల్నెస్ అందించే సేవలను ప్రధానికి తెలియజేసింది. 

ఆ తరువాత పూజ్య దాజీ, గౌరవనీయ ప్రధానికి హార్దిక స్వాగతం పలుకుతూ వారిని గురించి తన మనసులో పెల్లుబుకుతున్న లోతైన భావాలను తన ప్రసంగంలో పంచుకోవడం జరిగింది. దాదాపు 1978, ఆ ప్రాంతంలో నేనింకా సంస్థలో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, ఈ దేశాన్ని, ఈ భూమిని కూడా శాసించగలిగే ఒక గొప్ప రాజకీయ నాయకుడు గుజరాత్ లో పెరుగుతున్నాడని, పూజ్య బాబూజీ ఆ రోజుల్లో అన్నారని పెద్దలు చెప్పుకుంటూ ఉండటం నేను వినేవాడిని. దూరదృష్టితో పలికిన ఆ బాబూజీ మహారాజ్ గారి ఇంటికే ఇప్పుడు ఆ మహానుభావుడు విచ్చేయడం సంతోషకరం అన్నారు. వచ్చినందుకు కృతజ్ఞతను తెలిపారు. అంతేగాక, ప్రసంగ ప్రారంభంలో, మన సంస్థలో సాధారణంగా మనం ఆరా (మనిషి చుట్టూ ఆవరించియున్న కాంతిని)  గురించి మాట్లాడం; కేవలం దానికి సాక్షిగా ఉంటాం అన్నారు. కానీ మన మధ్యలో ఉన్న ఈ మహానుభావుడి ఆరా ప్రభావం నన్ను మాట్లాడేలా చేసిందన్నారు. ప్రధానిని కీర్తిస్తూ, వారు పార్లమెంటులో మాట్లాడుతున్నప్పుడు కూడా వారి మనసులో నకారాత్మకత ఉండదని, ఆనందంగా మాట్లాడతారని, నవ్వించే విధంగా హాయిగా మాట్లాడతారని, నిస్స్వార్థంగా మానవాళికి సేవాలనందించేవారి ఆరా అలాగే ఉంటుందని దానికి నేను కూడా వశుడినైపోయాను  అన్నట్లుగా దాజీ చెప్పడం జరిగింది. మన ప్రధాని కేవలం మన దేశానికే గాక, మొత్తం ప్రపంచానికే ఒక గొప్ప నాయకులవ్వాలని మనందరమూ ఆ పరమాత్మను ప్రార్థించాలి అని కోరడం జరిగింది. 

ఆ తరువాత అందరూ ప్రధాని సందేశం కోసం నిరీక్షిస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఎప్పటి నుండో వద్దామనుకున్నా పైవాడి నుండి అనుజ్ఞ వచ్చినప్పుడే సమయం వస్తుందన్నారు. అదిప్పుడు మీ మధ్య ఉండి, ఇప్పటి వరకూ వింటున్న కాన్హా శాంతి వనాన్ని దగ్గర నుండి వీక్షించే సౌభాగ్యం కలిగిందన్నారు. అందరినీ ఇక్కడకు పంపిస్తాడు కానీ, ఈయన మాత్రం రాడు అంటూ దాజీకి నా మీద   అభియోగం కూడా ఉందని నవ్వించారు. పూజ్య దాజీ వినమ్రత కట్టివేసే విధంగా ఉందని  కొనియాడారు. వారు నిర్వహిస్తున్న కార్యం నిజంగా అద్భుతం అని అభివర్ణించారు. కాన్హా శాంతివనం పర్యటనలో పూజ్య దాజీ అంత సూక్ష్మంగా వివరిస్తూ ఉంటే ఆయన (దాజీ) ఇక్కడ ప్రతీ కణంలో ఆవరించి ఉన్నారనిపించిందన్నారు.  లక్షమంది ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరంలో కలిసి ధ్యానించినప్పుడు ఉద్భవించే శక్తి ప్రభావం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించవచ్చన్నారు. మన ఋషుల, మహాత్ముల నుండి వారసత్వంగా లభించినటువంటి సుసంపన్నమైన మన ఆధ్యాత్మిక సంపదను మరింతగా  పెంపొందిస్తూ విశ్వ గురువుగా , విశ్వ మిత్ర గా భారతదేశాన్ని మార్చడంలో మనందరి బాధ్యత చాలా ప్రముఖమైనదని గుర్తు చేశారు. ప్రస్తుతానికి కేవలం కాన్హా శాంతి వనం యొక్క రుచి మాత్రమే చూశానని, మరలా తీరుబడిగా తప్పక రావాలని తన సంకల్పాన్ని వెలిబుచ్చారు. ఆ విధంగా మన ప్రధాని తన ప్రసంగాన్ని ముగించడం జరిగింది. 
వారు ప్రసంగ సమయంలో ఉటంకించిన ఒక భర్తృహరి సుభాషితం, ఈ సంస్కృత శ్లోకం ఇలా ఉంది :
 పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః ।

పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్ ॥

వృక్షాలు ఫలాలనిచ్చేది పరోపకారం కోసమే, ఇతరుల కోసమే; నదులు ప్రవహించేది పరోపకారం కోసమే; గోవులు పాలిచ్చేది ఇతరుల కోసమే; అలాగే ఈ మానవ శరీరం కూడా పరోపకారం కోసమే ఉన్నది, అని ఈ శ్లోకం యొక్క అర్థం. 

మన  ప్రిసెప్టర్ సోదరి దర్శ్విందర్ స్వాగతం పలుకుతున్నప్పుడు, పూజ్య దాజీ ప్రసంగిస్తున్నప్పుడు, ఆ తరువాత ప్రధాని మాట్లాడుతున్నప్పుడు మన అభ్యాసులు సమయోచితంగా తమ కరతాళ ధ్వనులతో ధ్యాన మందిరం మార్మ్రోగించారు . అక్కడి సూక్ష్మ ఆధ్యాత్మిక వాతావరణం కేవలం అక్కడకు వచ్చివారు మాత్రమే అనుభవించగలిగి ఉంటారు. ఆ తరువాత ప్రధాని పూజ్య దాజీ ఇంటికి విచ్చేసి, వారి ఆతిథ్యం స్వీకరించి తన కార్యనిర్వహణను కొనసాగించే క్రమంలో, కాన్హా అనుభూతిని తమ మనసులో చెరగని ముద్రగా తీసుకుని వెళ్ళి ఉంటారని నా ప్రగాఢ విశ్వాసం.  
 నవంబర్ 26, 2023 మన సంస్థ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుంది.

11, నవంబర్ 2023, శనివారం

స్పిరిచ్యువల్ అనాటమి - ఆధ్యాత్మిక శరీర నిర్మాణం - 2

 


స్పిరిచ్యువల్ అనాటమి  - ఆధ్యాత్మిక శరీర నిర్మాణం - 2

Nine Things This Book Will Teach You
Learn How To

Nurture the spiritual anatomy and understand the profound role of chakras in your well-being.

Break free from the shackles of conditioning that stifle your inner being.

Develop the sensitivity to listen to the heart and follow its infinite wisdom.

Forge authentic connections to foster understanding, empathy, and mutual growth.

Cultivate inner stillness as an anchor amidst the chaos of daily life.

Explore the realms of expanded consciousness and flow states.

Exhibit the behaviors that radiate joy and meaning into your life.

Harness a mindset of appreciation and contentment.

And most importantly, how to achieve these goals by integrating meditation into daily life.

https://heartfulness.org/en/spiritual-anatomy/
             
            ఈ పుస్తకం నేర్పించే తొమ్మిది విషయాలు                                      ఎలా చెయ్యాలో నేర్చుకోండి 
 స్పిరిచ్యువల్ అనాటమి ని అభివృద్ధి చేసుకోండి, మీరు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండటంలో చక్రాల యొక్క నిగూఢ పాత్రను అవగాహన చేసుకోండి.  

మీ అంతరంగ జీవుడిని ఊపిరాడకుండా నిర్బంధం చేసే శృంఖలాల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోండి. 

హృదయాన్ని వినిపించుకునే సున్నితత్వాన్ని పెంచుకొని హృదయంలో ఉన్న అపారమైన విజ్ఞతను అనుసరించండి. 

పరస్పర అవగాహన, సహానుభూతి, పరస్పర ఎదుగుదల పెంపొందడం కోసం ప్రామాణికమైన అనుబంధాలను బలంగా ప్రోత్సహించండి. 

 నిత్యజీవితంలో ఉండే కల్లోలం మధ్యలో స్థిరంగా లంగరులా ఉండేలా అంతరంగ నిశ్చలత్వాన్ని పెంపొందించుకోండి. 

విస్తరించిన చైతన్య క్షేత్రాలను, ప్రవాహంగా కలుగుతున్న స్థితులను శోధించండి 

మీ జీవితానికి అర్థం ఉండేలా, ఆనందాన్ని ప్రసరించే విధంగా మీ ప్రవర్తన ద్వారా ప్రదర్శించండి. 

గుర్తించే మనస్తత్వాన్ని, సంతుష్టిగా ఉండే మనస్తత్వాన్ని పెంపొందించుకోండి. 

అన్నిటికంటే ముఖ్యం, నిత్యజీవితంలో ధ్యానాన్ని మేళవించి ఏ విధంగా ఈ లక్ష్యాలను సాధించాలో నేర్చుకుంటారు.  


10, నవంబర్ 2023, శుక్రవారం

స్పిరిచ్యువల్ అనాటమి - ఆధ్యాత్మిక శరీర నిర్మాణం - 1

                                         

స్పిరిచ్యువల్ అనాటమి  - ఆధ్యాత్మిక శరీర నిర్మాణం - 1

స్పిరిచ్యువల్ అనాటమి (ఆధ్యాత్మిక శరీర నిర్మాణం) గ్రంథం పూజ్య దాజీ వారి సాధనలో అఖండంగా చేసిన ఆధ్యాత్మిక పరిశోధనల ఫలితం. ఈ గ్రంథం మనిషి తన జీవిత పరమార్థాన్ని, పరమగమ్యాన్ని చేరుకోడానికి అవసరమైన మార్గాన్ని, ఆధ్యాత్మిక యాత్రను, ఏయే చక్రాలలో ఎటువంటి వికాసం జరుగుతుంది, అసలు చక్రాలంటే  ఏమిటి, కేంద్రం వైపు ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుంది, ఈ క్రమంలో హార్ట్ఫుల్నెస్ ఆధ్యాత్మిక ప్రక్రియలు ఏ విధంగా సహకరిస్తాయి, ఈ విషయాలన్నీ సుస్పష్టంగా వెల్లడి చేయడం జరిగింది. 

ఇందులోని విషయాలన్నీ కూడా పూజ్య బాబూజీ మహారాజ్ తన గ్రంథాలలో ఇప్పటికే వెల్లడి చేసినవేనని, కానీ వారి భాష కొంచెం కఠినంగా ఉండటం వల్ల ఆ గ్రంథాలలో ఉన్నదాన్నే సరళమైన భాషలో మానవాళికి అందజేయాలన్న సంకల్పంతో ఈ గ్రంథాన్ని రచించడం జరిగిందని, అంతేగాక తన స్వానుభవంలో ప్రత్యక్షంగా అనుభూతి చెందినవని పూజ్య దాజీ పేర్కొనడం జరిగింది. 

ఈ గ్రంథంలోని కొన్ని ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి; ఇవి మనకు ఈ గ్రంథాన్ని చదివే స్ఫూర్తినివ్వడమే గాక మన వ్యక్తిగత సాధనను తీవ్రతరం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాను. బహుశా ఇటువంటి గ్రంథం ఇంతకు ముందెన్నడూ ప్రచురింపబడలేదేమో. చక్రాలను గురించి, చేతనాన్ని  వివరిస్తూ చాలా గ్రంథాలు వెలువడ్డాయి కానీ ఇంత సుస్పష్టంగా, విస్తృతంగా చేతనాన్ని గురించి, కాన్షియస్ నెస్  గురించి వ్రాసిన గ్రంథాలు కనిపించవు. కేవలం వీటిని గురించిన జ్ఞానాన్ని తెలియజేయడమే గాక, వీటిని ఈ జన్మలోనే హార్ట్ఫుల్నెస్ ధ్యాన ప్రక్రియల ద్వారా సాక్షాత్కరింపజేసుకోవచ్చునని నొక్కి చెబుతున్నారు పూజ్య దాజీ. కావున ఈ గ్రంథాన్ని ప్రతీ ఆధ్యాత్మిక సాధకుడు, సాధ్యమైనంత త్వరగా కొనుక్కుని అధ్యయనం చేయాలని నా నివేదన. 

ఈ క్రింది వాక్యాలు స్పిరిచ్యువల్ అనాటమి పుస్తకంలో వ్రాసుకున్నవి: 

The guiding mantra of Spiritual Anatomy is read and enjoy, do and feel, meditate and transcend.

స్పిరిచ్యువల్ అనాటమి యొక్క మార్గదర్శక సూత్రం: చదివి ఆనందించండి, చేసి అనుభవంలోకి తెచ్చుకోండి, ధ్యానించి అతీతస్థితులను పొందండి. 

Spiritual Anatomy is written to help you achieve your fullest potential and accelerate the tipping point of our collective consciousness.

స్పిరిచ్యువల్ అనాటమి వ్రాసినది, మీలో నిద్రాణమై ఉన్న శక్తిని సంపూర్ణంగా వెలికి తీయడం కోసమే; మన సామూహిక చేతనాన్ని ఒక ఉచ్ఛ స్థితికి తీసుకొచ్చే ప్రక్రియను తీవ్రతరం చేయడానికే.  

Spiritual Anatomy is a comprehensive collection of spiritual research on the soul’s anatomy and journey. The journey commences from the heart, the pulsating centre that unlocks the portals of growth and enlightenment.

స్పిరిచ్యువల్ అనాటమి అనేది, ఆత్మ యొక్క నిర్మాణాన్ని గురించి, ఆత్మ యొక్క యాత్రను గురించిన సమగ్రమైన ఆధ్యాత్మిక పరిశోధన. ఈ ప్రయాణం స్పందించే హృదయం నుండి ప్రారంభమవుతుంది, అదే ఆధ్యాత్మిక పరిణతికి, జ్ఞానానికి సంబంధించిన ద్వారాలను తెరుస్తుంది. 

The heart is the inner guide, the real guru on the journey to the Absolute.

హృదయమే అంతరంగ మార్గదర్శి, పరతతత్వాన్ని చేరడానికి  చేసే యాత్రలో మార్గదర్శనం చేసే అసలైన గురువు, హృదయం. 

We are all connected intellectually, morally and spiritually through the invisible connection of our hearts, weaving us all into a common grand destiny.

మనందరమూ బుద్ధిపరంగానూ, నైతికంగానూ, ఆధ్యాత్మికంగానూ మన హృదయాల ద్వారా కనిపించని అనుబంధం కలిగి ఉన్నాం. మనందరి మహత్తరమైన సమిష్ఠి విధిని రూపొందిస్తుంది. 

Understanding comes from experience, and experience comes from practice. And to practice well, you need more practice. That’s where repetition helps.

అనుభవంతోనే అవగాహన వస్తుంది, అనుభవం అభ్యాసం ద్వారా వస్తుంది. మరి అభ్యాసం బాగా చెయ్యాలంటే మరింత అభ్యాసం చెయ్యవలసి ఉంటుంది. పునరావృతి అక్కడే పనికొస్తుంది. 

It’s important to respect the religion we were born into, but it’s also crucial to take the next step toward diving into the ocean of spirituality. The yatra takes us from religion to spirituality, from spirituality to reality, from reality to bliss, and from bliss to nothingness.

మనం జన్మించిన మతాన్ని గౌరవించడం ముఖ్యం; కానీ దాని తరువాత ఆధ్యాత్మికత అనే మహాసముద్రంలోకి మునకవేసే అడుగు వేయడం కూడా చాలా కీలకమే. ఈ యాత్ర మతం నుండి ఆధ్యాత్మికతకు, ఆధ్యాత్మికత నుండి సత్యతత్త్వానికి, సత్యతత్త్వం నుండి పరమానంద స్థితికి, పరమానంద స్థితి నుండి శూన్య స్థితికి తీసుకువెళ్తుంది. 

Spiritual Anatomy is the story of an extraordinary adventure where the main character, your consciousness, undertakes an epic voyage to the shores of ultimate reality and steps beyond.

స్పిరిచ్యువల్ అనాటమి అనేది ఒక అసాధారణమైన సాహసయాత్రకు సంబంధించిన కథ; ఇందులో ప్రముఖ పాత్ర వహించే మీ చేతనం, అంతిమ సత్యం యొక్క తీరాలకు చేరడానికి, ఇంకా అతీతంగా ముందుకు సాగడానికి చేసే మహత్తరమైన యాత్ర. 

Spiritual Anatomy offers an in-depth understanding of the journey of consciousness. It charts a path wherein one can attain levels of consciousness that are usually thought of as unattainable without rigorous practices and extreme levels of sacrifice.

స్పిరిచ్యువల్ అనాటమి, చేతన యొక్క యాత్రను లోతుగా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. సాధారణంగా కఠోరమైన తపస్సులు, విపరీతమైన త్యాగాలు చేస్తే తప్ప, సాధ్యంకాదనేటువంటి ఆధ్యాత్మిక స్థాయిలను సిద్ధిమపజేసుకోవడం ఎలాగో స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. 

-          Daaji, దాజీ 

9, నవంబర్ 2023, గురువారం

స్పిరిచ్యువల్ అనాటమి - ఆధ్యాత్మిక శరీర నిర్మాణం - చిరుపరిచయం

 




స్పిరిచ్యువల్ అనాటమి - ఆధ్యాత్మిక శరీర నిర్మాణం 

గురుదేవులు పరమపూజ్య దాజీ, స్పిరిచ్యువల్ అనాటమీ (పైన చిత్రంలో ఎడమవైపునున్నది) అనే గ్రంథాన్ని రచించి, మానవాళికి  అందజేయడం జరిగింది. ఈ పరమోత్కృష్ఠ  గ్రంథాన్ని అక్టోబర్ 24, 2023 న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో విడుదల చేయడం జరిగింది. దీన్ని అంతకు పూర్వం ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త డా. దీపక్ చోప్రా చేత కాన్హా శాంతివనంలో పూజ్య దాజీ ఆవిష్కరింపజేయడం జరిగింది. (పైన చిత్రంలో కుడిప్రక్కన చూడవచ్చు).

ఈ గ్రంథాన్ని ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో పూజ్య దాజీ ప్రపంచ ఖ్యాతి గడించిన అనేక ప్రముఖులతో అనేక ఆన్ లైన్ సంభాషణలు కొనసాగిస్తూ ఉన్నారు.  ఈ సంభాషణాల్లో పూజ్య దాజీ సంభాషిస్తున్న ప్రముఖులు వేస్తున్న అనేక నిగూఢమైన ప్రశ్నలకు ఎంతో ఓపికగా, ఎంతో సరళంగా, ఎంతో స్పష్టంగా ఈ  గ్రంథాన్ని గురించిన సమాధానాలు వెల్లడించడం జరుగుతున్నది. వాటిల్లో ముఖ్యమైన అంశాలను మనకందరికీ అర్థమయ్యే అంశాలను మాత్రమే ఈ బ్లాగుల ద్వారా, ఈ చిన్ని చిన్ని వ్యాసాల ద్వారా అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. జనవరి 2024 లో ఈ గ్రంథాన్ని భారత దేశంలో కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఈ లోపల ఈ గ్రంథంలోని అనేక అంశాలను ప్రస్తావిస్తున్న ఈ సంభాషణల ద్వారా సాధ్యమైనంతగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.  

తదుపరి వ్యాసం నుండి ఈ అంశాలను ఒక్కొక్కటిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ గ్రంథాన్ని గురించిన చిరు పరిచయం:

స్పిరిచ్యువల్ అనాటమీ అంటే తెలుగులో అర్థం చేసుకోవాలంటే ఆధ్యాత్మిక శరీర నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఈ గ్రంథం కవర్ పేజీలో ధ్యానము, చక్రాలు, కేంద్రం వైపు చేసే యాత్ర అని వ్రాసుంటుంది, ఆంగ్లంలో. దాజీ, ఆయన ఇంచుమించు ధ్యానం ప్రారంభించినప్పటి నుండి ఈ విషయాన్ని గురించి, ఎన్నో సంవత్సరాల నుండి ఆలోచిస్తూ ఉన్నారట. బలంగా 2016 నుండి వ్రాయడానికి దృఢసంకల్పులై సన్నద్ధులయ్యారట. 2023 లో అది సిద్ధమయ్యింది. ఎట్టకేలకు అక్టోబర్  24 న అమెరికాలో విడుదల చేయడం జరిగింది. 

ఈ గ్రంథానికి మార్గదర్శక సూత్రం ఈ క్రింది విధంగా ఉందని దాజీ గ్రంథంలో వ్రాసుకున్నారు:

స్పిరిచ్యువల్ అనాటమీ యొక్క మార్గదర్శక సూత్రం: చదివి ఆనందించండి, చేసి అనుభూతి చెందండి, ధ్యానించి అతీతంగా ప్రయాణించండి. 

The guiding mantra of Spiritual Anatomy is read and enjoy, do and feel, meditate and transcend.

తదుపరి వ్యాసాల్లో కొంచెం-కొంచెంగా, అంచెలంచెలుగా ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. 



8, నవంబర్ 2023, బుధవారం

మానవ జీవన యదార్థ లక్ష్యం - మానవ జీవిత ప్రయోజనం

 



మనలో ఎంతమందికి మానవ జీవితం యొక్క పరమ గమ్యాన్ని గురించిన అవగాహన ఉంది?
లక్షలమందిలో బహుశా ఒక్కరికీ ఉండవచ్చు. అటువంటి లక్షల మందిలో కొన్ని వందల మందిని ఒక్కచోటుకు చేరిస్తే, వాళ్ళల్లో ఒక్కరో ఇద్దరో గమ్యాన్ని చేరకోగలుగుతారంటారు, శ్రీకృష్ణభగవానుడు. 
కానీ ఈ పరిస్థితిని మనం మార్చవలసి ఉంది. శ్రీకృష్ణ భగవానుడికి మనం అంత బలహీనులం కాదని నిరూపించాలి. మనం ఈ గమ్యాన్ని సాధించగలం. మార్గాలున్నాయి. - దాజీ  

మానవ జీవన యదార్థ లక్ష్యం  -  మానవ జీవిత ప్రయోజనం
 మానవ జీవిత యదార్థ లక్ష్యము, మానవ జీవిత ప్రయోజనము - ఈ రెండిటి అర్థం ఒక్కటే అన్నట్లుగా అనిపిస్తూంటుంది. పూజ్య చారీజీ ఈ రెండింటిలో ఉన్న సూక్ష్మ వ్యత్యాసాన్ని తెలియజేయడం జరిగింది. 

మానవ జీవిత యదార్థ లక్ష్యం మనుషులందరికీ ఒక్కటే, అందరికీ సమానమే. మన ప్రార్థనలో చెప్పినట్లుగా, ఆ పరమాత్మే మన యదార్థ లక్ష్యం; ఆ పరమాత్మలో సంపూర్ణంగా లయమవడమే జీవిత పరమార్థం. ఇది అందరికీ సమానంగా ఉండే లక్ష్యం. కానీ మానవ జీవిత ప్రయోజనం వ్యక్తిగతమైనది. ప్రతీ మనిషి జీవితమూ చాలా ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరికీ తనకంటూ ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుందన్నారు పూజ్య చారీజీ. కాబట్టి మనిషి తన జీవిత ప్రయోజనాన్ని తనకు తానే తెలుసుకోవాలి; అక్కడ ధ్యానం సహకరిస్తుంది. వ్యక్తిగత జీవిత ప్రయోజనాన్ని తనకు తానే ధ్యాన లోలోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవడం, ఆ తరువాత ఆ జీవితాన్ని మానవ జీవిత యదార్థ లక్ష్యం దిశగా మలచుకోవడం, ఇదే మానవ జీవిత ప్రయోజనం. 

ఉదాహరణకు ఈ  భూమ్మీద అవతరించిన, ఇప్పటికీ అవతరిస్తున్న, ఎందరో  మహానుభావుల చరిత్రలు గనుక పరిశీలిస్తే, ప్రతి ఒక్కరూ తమదైన ప్రయోజనం కోసం జీవించి వెళ్ళినట్లుగా, మానవాళికి ఆదర్శంగా మార్గదర్శకంగా జీవించినట్లుగా  గమనిస్తాం. ఒక్కొక్కరూ ఒక్కొక్క ప్రయోజనం కోసం జీవించి మానవాళికి ఉదాహరణలుగా ఉన్నారు. స్వామి వివేకానంద భరత జాతిని మేలుకొల్పడానికి జన్మించినట్లుగా అనిపిస్తుంది; ఏసు క్రీస్తు కరుణను నేర్పించడానికి వచ్చినట్లుగా అనిపిస్తుంది; శ్రీకృష్ణ భగవానుడు ధర్మస్థాపన కోసం, కర్మాభక్తిజ్ఞాన యోగాలను బోధించడం కోసం, లాలాజీ ప్రాణాహుతి విద్యను పునరుద్ధరించడం కోసం, బాబూజీ, ప్రాణాహుతితో కూడిన ధ్యానపద్ధతికి పరిపూర్ణత చేకూర్చి మనుషులు సరళంగా పరిపూర్ణతను సాధించడానికి, పూజ్య చారీజీ అభ్యాసుల్లో చక్కటి పునాదులు ఏర్పరచి నూరు దేశాలలో వ్యాపింపజేయడానికి, పూజ్య దాజీ ఇంటింటా ప్రపంచమంతటా వ్యాపియమపజేయడానికి ఇలా వివిధ ప్రయోజనాలతో మహాత్ములు జన్మిస్తారు. అలాగే ప్రతి వ్యక్తికీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. దాన్ని ఎవరికి వారు ధ్యాన లోలోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవలసినదే. ఏదోక దశలో తమ జీవిత ప్రయోజనం ఏమిటో స్ఫురించిన క్షణం నుండి ఆ వ్యక్తి ఆ దిశగా నిస్స్వార్థంగా తనను తాను మరచిపోయి జీవించడం ప్రారంభిస్తాడు. 

మనలో ఎంతమందికి మానవ జీవితం యొక్క పరమ గమ్యాన్ని గురించిన అవగాహన ఉంది?
లక్షలమందిలో బహుశా ఒక్కరికీ ఉండవచ్చు. అటువంటి లక్షల మందిలో కొన్ని వందల మందిని ఒక్కచోటుకు చేరిస్తే, వాళ్ళల్లో ఒక్కరో ఇద్దరో గమ్యాన్ని చేరకోగలుగుతారంటారు, శ్రీకృష్ణభగవానుడు. 
కానీ ఈ పరిస్థితిని మనం మార్చవలసి ఉంది. శ్రీకృష్ణ భగవానుడికి మనం అంత బలహీనులం కాదని నిరూపించాలి. మనం ఈ గమ్యాన్ని సాధించగలం. మార్గాలున్నాయి. - దాజీ  

పైన దాజీ చెప్పిన వాక్యాలు వింటూ ఉంటే, చదవుతూ ఉంటే, వారి సంకల్పాలను అర్థం చేసుకుంటూ ఉంటే, వారు నిర్దేశించిన బాటలో నడుస్తూ ముందుకు సాగుతూ ఉంటే కూడా, ఏదోక క్షణంలో మనుషులందరూ తమ జీవిత ప్రయోజనాన్ని గుర్తించి తమ జీవనం కొనసాగించినప్పుడు ఈ భూమాత పులకరించి ఈ  భూలోకమే బ్రైటర్ వరల్డ్ గా మారే రోజు తప్పక వస్తుంది; మనం చూసినా చూడకపోయినా; కనీసం అందుకు తోడ్పడినవారుగా మిగిలిపోవచ్చు; మన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు; దివ్యంగా మార్చుకోవచ్చు. 

2, నవంబర్ 2023, గురువారం

మనిషి జీవితంలో గురువు అవసరం, గురువు ప్రాశస్త్యం

మనిషి జీవితంలో గురువు అవసరం, గురువు ప్రాశస్త్యం 

గురోరంఘ్రి పద్మే మనశ్చైన లగ్నం, 

తతః కిం, తతః కిం, తతః కిం, తతః కిం. 

- ఆదిశంకరాచార్యులవారు   

గురువు అంటే ఎవరు కాదు? 

మొట్టమొదటగా మనం అర్థం చేసుకోవలసినది, గురువు అంటే అధ్యాపకుడు కాదు; టీచర్ కాదు; వివిధ వృత్తి విద్యలు నేర్పించే శిక్షకులు కాదు; ఆచార్యుడు లేక ప్రొఫెసర్ కూడా కాదు. ప్రసంగాలు చేసేవారు, ప్రవచ్చనకర్తలు, కేవలం కాషాయ వస్త్రాలు ధరించినవారు, వీళ్ళెవరూ కాదు. వీళ్ళందరూ వివిధ రకాల విద్యలను బోధించే స్థానంలో ఉన్నప్పటికీ, కొంతవరకూ అజ్ఞానాన్ని తొలగించేవారైనప్పటికీ, తప్పక కృతజ్ఞత కలిగి ఉండవలసిన వ్యక్తులే అయినప్పటికీ, తప్పక గౌరవించవలసినవారే అయినప్పటికీ, కూడా వీరికి ఆధ్యాత్మిక గురువు యొక్క స్థానాన్ని ఆపాదించడానికి లేదు. 

గురువు యొక్క అవసరం మనిషికి ఎప్పుడు ఏర్పడుతుంది? 

మన చుట్టూ కనిపించే ఈ అస్తిత్వానికి, మన అస్తిత్వానికి గల కనిపించని మూలకారణం యేదో ఉందనిపించినప్పుడు, దాన్ని ఎలాగైనా తెలుసుకోవాలన్న తీవ్ర ఆకాంక్ష, జిజ్ఞాస కలిగినప్పుడు, అజ్ఞానంలో సమాధానాలు ఎక్కడ వెతకాలో  దిక్కుతోచక, ఎవరైనా మార్గదర్శనం చేసేవారుంటే బాగుండునని బాగా తపిస్తూ ఉన్నప్పుడు, గురువు యొక్క అవసరం ఏర్పడుతుంది, ఆయన కోసం తపన, ప్రారంభమవుతుంది. అప్పటి వరకూ జీవితం అనుకూలంగా నడుస్తున్నంత సేపూ గురువు లేక భగవంతుడి అవసరం ఏర్పడదు.  

అసలు మనిషి జీవించడం ఎలాగో తెలియనప్పుడు కూడా మనిషికి, అది ఎవరు నేర్పిస్తారన్న ప్రశ్న కలుగుతుంది. మనిషిని సృష్టించిన భగవంతుడే స్వయంగా నేర్పించాలి; ఆయన మనకి అందుబాటులో లేడు. లేదా, సరైన గురువు నేర్పించాలి; గురువు కూడా అందుబాటులో లేకపోయినట్లయితే? అప్పుడు జీవితమే  నేర్పిస్తుంది. కానీ జీవితం నేర్పిస్తే, చాలా కఠినంగా నేర్పిస్తుంది. చాలా సమయం వ్యర్థమయ్యే అవకాశం ఉంటుంది పాఠాలు నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది.  కాబట్టి గురువు తన స్వానుభవం ద్వారా ఈ భవసాగరాన్ని ఏ విధంగా సమర్థవంతంగా ఈది, తన జీవిత ప్రయోజనాన్ని, జీవిత గమ్యాన్ని చేరుకోవాలో మార్గదర్శనం చేస్తాడు. అప్పుడు చాలా సమయం ఆదా అవడమే గాక, ఈ జన్మలోనే జన్మసాఫల్యాన్ని సిద్ధింప జేసుకునే అవకాశం ఉంటుంది. 

అటువంటి గురువును ఎలా వెతకడం? ఎలా గుర్తించడం?

ఆధ్యాత్మిక దిగ్గజాలందరూ, మహాత్ములందరూ ఏకగ్రీవంగా చెప్పేది గురువును భౌతికంగా వెతకనవసరం లేదు. ఒకవేళ వెతికినా మనం మన పరిమితమైన తెలివితేటలతోనూ, పరిమితమైన జ్ఞానంతోనూ, పరిమితమైన అనుభవంతోనూ గురువును అంచనా వేసి ఆ వ్యక్తిని గురువుగా భావించే అవకాశం ఉంటుంది. సాధారణంగా అటువంటి నిర్ణయం పొరపాటుగా పరిణమించే  అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేసే విషయం కాదు; బజార్లో వెతికే వస్తువు కాదు గురువు. 

మనకు నిర్దేశించిన గురువును మన హృదయంలో గల తీవ్ర తపనే మన గుమ్మంలోకి  వచ్చేలా చేస్తుంది. అన్వేషకుడు చెయ్యవలసినదల్లా, గురువు తటస్థించే వరకూ  కేవలం తనలో ఉన్న తపనను తీవ్రతరం చేసుకుంటూ నిరీక్షించడమే. 

మరో రకంగా గురువు తటస్థించే అవకాశం: మన ఆప్తులు, శ్రేయోభిలాషుల ద్వారా తెలియడం. అప్పుడు మనకు తోచిన విధంగా గురువును పరీక్షించిన తరువాత  గురువు లభించాడన్న నిర్ధారణకు రావాలి. 

సరైన గురువును గుర్తించాలంటే: అటువంటి మహాత్ముని సమ్ముఖంలో మన మనసు ఒక్కసారిగా ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మారుతుంది; అలౌకికమైన ఆనందం కలుగుతుంది హృదయంలో; అస్సలు ప్రశ్నలు తలెత్తవు. ఆ విధంగా మీ హృదయం మీకు నిర్దేశించిన గురువు తటస్తమైన వెంటనే స్పందించినప్పుడు వెంటనే అటువంటి వ్యక్తిని గురువుగా స్వీకరించాలి. బుద్ధి, హృదయానికి మధ్య ఎటువంటి స్ఫర్థ ఉండదు. అలా జరగని పక్షంలో మన నిరీక్షణ కొనసాగించాలి. 

గురువు ప్రాశస్త్యం

అటువంటి గురువు సాధకుడి జీవితంలో తటస్థించిన క్షణం జీవిత పరిష్కారం లభించినట్లే. ఇక మిగిలినది వారు చెప్పింది, చెప్పినట్లుగా, విధేయతతో ఉంటూ వారిని అనుసరించడమే. 

సాధకుని జీవితంలో గురువు యొక్క పాత్ర, రసాయన ప్రక్రియలో ఉత్ప్రేరకం లాంటిది. ఉత్ప్రేరకం తాను రసాయన ప్రక్రియకు లోనుగాకుండా, ఆ ప్రక్రియను తీవ్రతరం చేస్తుంది. అదే విధంగా గురువు శిష్యుని ఆధ్యాత్మిక పరిణతిలో తన పాత్రను నిర్వహిస్తాడు; చేయి పట్టుకొని శిష్యుని అన్నీ పరిస్థితులలోనూ కాపాడుకుంటూ, ఒక్కొక్క చక్రాన్ని సునాయాసంగా దాటిస్తాడు. ఒక్కొక్క చక్రంలో ఉండే ప్రలోభాలకు, అపాయాలకు గురిగాకుండాగా, సంరక్షిస్తూ పరమగమ్యానికి చేరుస్తాడు. గురువు శిష్యుని జీవితంలో భౌతికంగానూ, ఆధ్యాత్మికంగానూ కూడా వెన్నంటే ఉండి కాపాడుతూ ఉంటూ శిష్యుని యొక్క సమర్థతను పెంచుతూ ఉంటాడు; మానవ జీవితం  యొక్క యదార్థ లక్ష్యాన్ని చేరుకునేలా సహకరిస్తాడు. గురువు యొక్క అవసరం చిట్టచివరి దాకా ఉంటుంది; ఇంకా చెప్పాలంటే ఆ తరువాత కూడా ఉంటుంది; గురువును మించిన శిష్యునిగా తయారైనా కొనసాగుతుంది. 

అందుకే అటువంటి గురువు యొక్క పాదాలపైన మనస్సు లగ్నం చేయలేకపోతే ఈ ప్రపంచంలో ఏమి సాధించినా ఏమిటి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం? తతః కిం, తతః కిం, తతః కిం, తతః కిం అంటారు శంకురులు. అటువంటి గురువును గురుస్సాక్షాత్ పరబ్రహ్మగా హృదయంలో శాశ్వతంగా ప్రతిష్ఠించుకోవాలి. 



 



భక్త హనుమాన్ జయంతి

    భక్త హనుమాన్ జయంతి  హనుమజ్జయంతి ప్రతి సంవత్సరమూ చైత్ర శుక్ల పౌర్ణమినాడు ప్రపంచమంతటా ఉన్న హిందువులు జరుపుకుంటారు. శ్రీరామాయణ కావ్యంలో హను...