భగవంతుడు లేక ఆ సత్యతత్త్వం అందరిలోనూ అంతర్యామిగా ఉన్నాడన్నది ఋత వాక్కు, మనకున్న మేధాపరమైన జ్ఞానం. అందుకే భగవంతుడిని సర్వాంతర్యామి అని కూడా అంటారు. అయితే, మనందరిలో ఉన్న ఈ అంతర్యామితో నిజంగా అనుసంధానమవడం ఎలాగో నేర్పేవాడు, ఆ అనుభూతిని కలిగించడంలో సహాయపడేవాడు మాత్రమే నిజమైన గురువు అవుతాడు. అటువంటి గురువు లేకుండా ఈ అనుసంధానం జరగడం అసాధ్యం.
హార్ట్ ఫుల్ నెస్, సహజమార్గ ఆధ్యాత్మిక సాంప్రదాయంలోని గురువు ద్వారా నేర్చుకున్న విధానం, అనుభూతి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తానిక్కడ.
భగవంతుడు మనందరి హృదయంలో అంతర్యామిగా ఉన్నాడని అన్ని మతాలు అంగీకరిస్తాయి, మన మహర్షులందరూ చెప్పింది కూడా అదే. అంతర్యామితో అనుసంధానమవడానికి మనసు ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం అంటారు; అంతే కాదు మనం కోరుకున్న వెంటనే మనసు ప్రశాంత స్థితికి రాగలగాలి. మనసు ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడే ఆ భగవంతునితో లేక ఆ అంతర్యామితో అనుసంధానం జరుగుతుంది. దీనికి అంతర్ముఖులై హృదయంపై ధ్యానించడం చాలా అవసరం. ఈ సహజమార్గ ధ్యాన పద్ధతిని అనుసరించడం చాలా ఉపయోగిస్తుంది.
ఆ అనుభూతి ఎలా ఉంటుంది?
ఆ అనుభూతి క్షణకాలమైనా కూడా అలౌకికంగానూ, అనిర్వచనీయంగానూ, వర్ణించలేని విధంగా ఉంటుంది. అన్నిటికీ అతీతమైన అనుభూతి. ఆ రుచి కలిగిన తరువాత మనసు ప్రతి క్షణమూ దాని కోసం తపిస్తూ ఉంటుంది. ఆ రుచే మనలను మరింత తీవ్రంగా ధ్యానించేలా చేస్తుంది. ఆ క్షణికమైన అనుభూతి రోజుకు 24 గంటలూ, గంటకు 60 నిముషాలు, నిముషానికి 60 సెకన్లూ, జాగృతస్వప్నసుషుప్తి అనే మానవుడుండే మూడు అవస్థల్లోనూ ప్రతి నిత్యమూ ఈ దివ్యానుభూతి చెందుతూ లేక స్మరిస్తూ, ఆ స్పృహలోనే నిత్య దైనందిన కార్యాలన్నీ చేసుకునే పరిస్థితి వచ్చే అవకాశం ప్రతీ సాధకుడికీ ఉంది. ఇటువంటి అనుభూతి మన మూలాన్ని ప్రతి రోజూ గుర్తు చేస్తుంది.
అటువంటి స్పృహలో లేక చైతన్యంలో సాధకుడు జీవించినప్పుడు ఇదే ఆఖరి జన్మ అవుతుంది, ఈ జన్మకు సార్థకత కలుగుతుంది; ఆ తరువాత ఇతరుల కోసం జీవించడం జరుగుతుంది; గురువు సంకల్పానుసారం జీవితం కొనసాగుతుంది.
అంతర్యామితో అనుసంధానం అంత తేలికా?
ఇది ఒక నమ్మలేని నిజం. కేవలం అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగినది. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని క్రతువులు చేసినా కలగని అనుభూతి. అందుకే బాబూజీ - భగవంతుడు సరళుడు, ఆయనను అనుభూతి చెందే మార్గం కూడా సరళంగానే ఉండాలనేవారు. క్రిందపడిన సూదిని ఎత్తడానికి క్రేన్ సహాయం అవసరం లేదని మనం ఈశ్వరానుభూతి కోసం అటువంటి మార్గాలనే అవలంబిస్తున్నామని బాబూజీ అంటూండేవారు.
ఇంత తేలికగా ఆ అనుభూతి కలగడానికి ఈ ధ్యాన పద్ధతిలోని ప్రత్యేకత ఏమిటి?
ఈ పద్ధతిలోని రెండూ ప్రత్యేకతలు అంతర్యామితో ఈ అనుసంధానాన్ని సరళతరం చేస్తాయి - 1) ప్రాణాహుతి అనే దివ్య శక్తి ప్రసరణ 2) శుద్ధీకరణ అనే యౌగిక ప్రక్రియలు. ప్రాణాహుతి అనే యౌగిక ప్రక్రియ వల్ల హృదయాంతరాళంలో ఉన్న మూలంతో మనసును అనుసంధానం చేస్తుంది. దీన్ని సమర్థుడైన గురువు మాత్రమే ప్రసరించగలడు లేక ఆయన అనుమతించిన ప్రశిక్షకులు మాత్రమే ప్రసరించగలరు. శుద్ధీకరణ అనే యౌగిక ప్రక్రియ ఈ అనుసంధానానికి అడ్డుపడే అవరోధాలను తొలగించి మనసును శుద్ధి చేస్తుంది.
బ్రదర్
రిప్లయితొలగించండిమనం కోరుకున్న వెంటనే మనసు ప్రశాంత స్థితికి రాగలగాలి అని వ్రాసారు. ఒక్కొక్కసారి, రోజులో ప్రశాంత స్థితిని ఉండదు. కొన్నిసార్లు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆశ్రమ వాతావరణంలో, పుస్తకాలు చేదివేటప్పుడు ...అలా అనమాట. దీనిని నిలుపుకోవడానికి మాష్టర్లు చెప్పిన సూత్రాలను పాటించినా ప్రశాంత స్థితి కష్టమవుతోంది. ఏమైనా సరళమైన పద్దతులు చెప్పగలరు.
- భద్రం