20, జూన్ 2023, మంగళవారం

సమగ్ర యోగా - ఈనాటి మానవుని దినచర్యలో తప్పనిసరిగా ఉండవలసినది

యోగాసనాలు       ప్రాణాయామం       ధ్యానం
 
సమగ్ర యోగా 
(యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం)


మానవుడి సంపూర్ణ ఆరోగ్యం కోసం అంటే  శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాల కోసం చేయవలసిన యోగాభ్యాసమే సమగ్ర యోగా.  

యోగా అనగానే మనకు మనసులోకి వచ్చేది, కొన్ని ఆసనాలు, ప్రాణాయామాయలు, అనే కొన్ని శ్వాస ప్రక్రియలు. నిజానికి ఆసనం, ప్రాణాయామం అనేవి సమగ్ర అష్టాంగ యోగంలోని 3 వ అంగము, 4 వ అంగము మాత్రమే. 

పతంజలి మహర్షి వ్రాసిన సమగ్ర అష్టాంగ యోగంలోని 8 అంగాలు ఇలా ఉన్నాయి: 1) యమ 2) నియమ 30 ఆసన 4) ప్రాణాయామ 5) ప్రత్యాహార 6) ధారణ 7) ధ్యాన 8) సమాధి. 

మొదటి రెండు అంగాలు అంటే యమ-నియమాలు సౌశీల్య నిర్మాణానికి సంబంధించినవి. 

ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు శారీరక ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు. 

ధారణ, ధ్యానాదులు , అంతర్ముఖులై మానసిక ఆరోగ్యానికి, మనసుకు అతీతంగా ఉన్నతోన్నత సత్యాలను దర్శింపజేసే ప్రక్రియలు. 

సమాధి యోగసిద్ధిని, యోగం యొక్క పరమలక్ష్యాన్ని ప్రత్యక్షానుభవంలో సాక్షాత్కరించుకోవడం. 

ధారణ, ధ్యాన సమాధులను కలిపి సంయమనం అని కూడా అంటారు. 

మన హార్ట్ఫుల్నెస్ యోగసాధన సంయమనానికి సంబంధించినది. 

కాబట్టి, ప్రతి ఒక్కరూ యమనియమాలను అనుసరించడం ద్వారా శీలనిర్మాణం చేసుకుంటూ, ఆసన, ప్రాణాయామాల ద్వారా శారీరక ఆరోగ్యాన్ని  కాపాడుకుంటూ, ప్రత్యాహార, ధారణ, ధ్యానాల ద్వారా శారీరక ఆరోగ్యాన్ని సుస్థిరపరచుకుంటూ, సమాధి ద్వారా యోగసిద్ధిని  సాధించి, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని  కూడా సాధించి, అపరిపూర్ణుడుగా ఉన్న మానవుడు పరిపూర్ణుడుగా మారే అవకాశం ప్రతీ ఒక్కరికీ ఉంది. 


16, జూన్ 2023, శుక్రవారం

అంతర్యామితో అనుసంధానమవడం ఎలా?


 అంతర్యామితో అనుసంధానమవడం ఎలా? 

భగవంతుడు లేక ఆ సత్యతత్త్వం అందరిలోనూ అంతర్యామిగా ఉన్నాడన్నది ఋత వాక్కు, మనకున్న మేధాపరమైన జ్ఞానం. అందుకే భగవంతుడిని సర్వాంతర్యామి అని కూడా అంటారు. అయితే, మనందరిలో ఉన్న ఈ అంతర్యామితో నిజంగా అనుసంధానమవడం ఎలాగో  నేర్పేవాడు, ఆ అనుభూతిని కలిగించడంలో సహాయపడేవాడు మాత్రమే నిజమైన గురువు అవుతాడు. అటువంటి గురువు లేకుండా ఈ అనుసంధానం జరగడం అసాధ్యం. 

హార్ట్ ఫుల్ నెస్, సహజమార్గ ఆధ్యాత్మిక సాంప్రదాయంలోని గురువు ద్వారా నేర్చుకున్న విధానం, అనుభూతి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తానిక్కడ. 

భగవంతుడు మనందరి హృదయంలో అంతర్యామిగా ఉన్నాడని అన్ని మతాలు అంగీకరిస్తాయి, మన మహర్షులందరూ చెప్పింది  కూడా అదే. అంతర్యామితో అనుసంధానమవడానికి మనసు ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం అంటారు; అంతే కాదు మనం కోరుకున్న వెంటనే  మనసు ప్రశాంత స్థితికి రాగలగాలి. మనసు ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడే ఆ భగవంతునితో లేక ఆ అంతర్యామితో అనుసంధానం జరుగుతుంది. దీనికి అంతర్ముఖులై హృదయంపై ధ్యానించడం చాలా అవసరం. ఈ  సహజమార్గ ధ్యాన పద్ధతిని అనుసరించడం చాలా ఉపయోగిస్తుంది. 

ఆ అనుభూతి ఎలా ఉంటుంది?

ఆ అనుభూతి క్షణకాలమైనా కూడా అలౌకికంగానూ, అనిర్వచనీయంగానూ, వర్ణించలేని విధంగా ఉంటుంది. అన్నిటికీ అతీతమైన అనుభూతి. ఆ రుచి కలిగిన తరువాత మనసు ప్రతి క్షణమూ దాని కోసం తపిస్తూ ఉంటుంది. ఆ రుచే మనలను మరింత తీవ్రంగా ధ్యానించేలా చేస్తుంది. ఆ క్షణికమైన అనుభూతి  రోజుకు 24 గంటలూ, గంటకు 60 నిముషాలు, నిముషానికి 60 సెకన్లూ,  జాగృతస్వప్నసుషుప్తి  అనే మానవుడుండే మూడు అవస్థల్లోనూ ప్రతి నిత్యమూ ఈ  దివ్యానుభూతి  చెందుతూ లేక స్మరిస్తూ, ఆ స్పృహలోనే నిత్య దైనందిన కార్యాలన్నీ చేసుకునే పరిస్థితి  వచ్చే అవకాశం ప్రతీ సాధకుడికీ  ఉంది. ఇటువంటి అనుభూతి మన మూలాన్ని ప్రతి రోజూ గుర్తు చేస్తుంది. 

అటువంటి స్పృహలో లేక చైతన్యంలో సాధకుడు జీవించినప్పుడు ఇదే ఆఖరి జన్మ అవుతుంది, ఈ జన్మకు సార్థకత కలుగుతుంది; ఆ తరువాత ఇతరుల కోసం జీవించడం జరుగుతుంది; గురువు సంకల్పానుసారం జీవితం కొనసాగుతుంది. 

అంతర్యామితో అనుసంధానం అంత తేలికా?

ఇది ఒక నమ్మలేని నిజం. కేవలం అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగినది. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని క్రతువులు చేసినా కలగని అనుభూతి. అందుకే బాబూజీ - భగవంతుడు సరళుడు, ఆయనను అనుభూతి చెందే మార్గం కూడా సరళంగానే ఉండాలనేవారు. క్రిందపడిన సూదిని ఎత్తడానికి క్రేన్ సహాయం అవసరం లేదని మనం ఈశ్వరానుభూతి కోసం అటువంటి మార్గాలనే అవలంబిస్తున్నామని బాబూజీ అంటూండేవారు.  

ఇంత తేలికగా ఆ అనుభూతి కలగడానికి ఈ ధ్యాన పద్ధతిలోని ప్రత్యేకత ఏమిటి?

ఈ  పద్ధతిలోని  రెండూ ప్రత్యేకతలు అంతర్యామితో ఈ  అనుసంధానాన్ని సరళతరం చేస్తాయి - 1) ప్రాణాహుతి అనే దివ్య శక్తి ప్రసరణ 2) శుద్ధీకరణ అనే యౌగిక ప్రక్రియలు. ప్రాణాహుతి అనే యౌగిక ప్రక్రియ వల్ల హృదయాంతరాళంలో ఉన్న మూలంతో మనసును అనుసంధానం చేస్తుంది. దీన్ని సమర్థుడైన గురువు మాత్రమే ప్రసరించగలడు లేక ఆయన అనుమతించిన ప్రశిక్షకులు  మాత్రమే ప్రసరించగలరు.  శుద్ధీకరణ అనే యౌగిక ప్రక్రియ ఈ అనుసంధానానికి అడ్డుపడే అవరోధాలను తొలగించి మనసును శుద్ధి చేస్తుంది. 


14, జూన్ 2023, బుధవారం

మానవ ప్రయత్నం - భగవంతుని కృప/అనుగ్రహం

మనం నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తెలుసుకున్న తెలుసుకోకపోయినా, మానవ ప్రయత్నం, భగవంతుని కృప, ఈ  రెండూ  లేకుండా ఎ పనీ  జరగదు. కేవలం మానవ ప్రయత్నం సరిపోదు; అందుకే అన్ని పనులూ జరుగకపోవడానికి  కారణం. అలాగే కేవలం భగవంతుని కృప మాత్రమే సరిపోదు; భగవంతుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది; లేనిది మానవ ప్రయత్నం;  అందుకే ఆయన కృప ఉన్నా పనులు జరుగకపోవడానికి కారణం. 

ఇక్కడ మరొక్క విషయం తెలుసుకోవాలి; భగవత్సంకల్పానికి అనుగుణంగా మానవ సంకల్పం ఉంటేనే అది దివ్య జీవనం అవుతుంది; యోగాభ్యాసం యొక్క పరమ లక్ష్యం అదే. యోగాభ్యాసం, ఆధ్యాత్మిక సాధన అనేవి భగవత్ కృపను ఆకర్షించే విధంగా మన జీవితాలను మలచుకునే ప్రయత్నమే. 

భగవద్గీత 18 అధ్యాయంలో 78 వ శ్లోకంలో చెప్పినది దీనికి నిదర్శనం. 

యత్ర యోగీశ్వర కృష్ణో యాత్ర పార్థో ధనుర్ధరః |

తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ||

పైన చిత్రంలో శ్రీకృష్ణ భగవానుడు భాగవతకృపాకు ప్రతీక; ధనుర్ధరుడైన అర్జునుడు మానవ ప్రయత్నానికి ప్రతీక. ఒక విధంగా మానవ ప్రయత్నం భగవంతుని కృపాను ఆకర్షించే విధంగా, అనుగుణంగా ఉండాలని భగవద్గీత బోధిస్తున్నది. 
భగవంతుని కృపను గురించి మన గురుదేవులు చెప్పినవి ఇక్కడ స్మరించుకోవాలి. కృప అనేది కోరుకుంటే కలిగేది కాదు. కృప అనేది యోగ్యత సంపాదించుకొని ఒక విధంగా నిరీక్షించేది. కోరుకునేవాడికి సాధారణంగా  యోగ్యత ఉండదు; యోగ్యత ఉన్నవాడు సాధారణంగా కోరుకోవాలసిన పని లేదు; అనేవారు గురుదేవులు. కాబట్టి  భగవంతుని కృపను ఆకర్షించే విధంగా మన జీవితాన్ని మాలచుకోవడమే ఆధ్యాత్మిక సాధన లేక యోగాభ్యాసం.  యోగ్యతను పెంచుకునే దిశలో కృషి చేస్తూ, దేనికోసం తపిస్తున్నామో తెలియనటువంటి  ఒక విధమైన తీవ్రమైన తపనతో జీవితం కొనసాగించడమే మన విధి. 

8, జూన్ 2023, గురువారం

ఆధ్యాత్మిక సాధనలో సంకల్పాలు



సంకల్పం యొక్క పాత్ర 

మనస్ఫూర్తిగా చేసేదే సంకల్పం. ఆధ్యాత్మిక జీవనం ఏమిటి,  భౌతిక  జీవనం ఏమిటి,  సంకల్పాలు  లేనిదే  జీవితమే  లేదు. మన సంకల్పాలు ఎలా ఉంటే  మన జీవితం కూడా అలాగే  ఉంటుంది. ఇది మనం అనుభవంలో తెలుసుకోవచ్చు. తరచి  చూసినట్లయితే, ఇతరుల సంకల్పాలు  కూడా  మనపై  పని చేస్తూ ఉంటాయి. అంతే కాదు అన్నిటి కంటే  ప్రభావపూరితమైనది  దైవ సంకల్పం. దైవ సంకల్పానికి  ఏదీ  విరుద్ధంగా  పని  చేయలేదు. 

నిత్యజీవనంలో మనం చేసుకునే సంకల్పాలు 

ఉదయాన్నే  లేవాలనుకుంటే రాత్రి  పడుకొనే  ముందు చేసుకునే సంకల్పం ఇది. తప్పక నెరవేరడం మనం అనుభవంలో  చూస్తున్నాం. 

ఫలానా సమయానికి ఆఫీసులో ఉండాలనుకోవడం; వారం రోజుల్లో ఫలానా పని  పూరతవ్వాలనుకోవడం ఇటువంటి మామూలు సంకల్పాలు మన అనుభవంలోనివే, 

ఇవి గాక మనిషి సంకల్పం అతను పోయినప్పటికీ  పని చేస్తూ ఉంటాయి; దాన్నే  మనం వీలునామా లేక వీళ్ళు అంటాం. 

అలాగే  ప్రభుత్వ సంకల్పాలు , మన బాస్ ల సంకల్పాలు, మన సంస్థల సంకల్పాలు  కూడా మనపై పని చేస్తూ ఉంటాయి. 

ఇలా  మన జీవితంఏ  సంకల్పాల మాయం. 

మన వ్యక్తిగత సంకల్పశక్తిని దైవ సంకల్పానికి అనుగుణంగా మాలచుకోవడానికే ఈ  ఆధ్యాత్మిక సాధన ప్రయోజనం. అప్పుడే  శాంతి, సుఖం, ఆనందం. 

అసలు సంకల్పం అంటే ఏమిటి?

సంకల్పం అంటే తలపెట్టడం. ఫలానా పని చేయాలని సంకల్పించామ అంటాం; ఫలానా యాగం చేయాలని సమకల్పించామ అంటాం; ఫలానా ప్రాజెక్టు  చేయాలని తలపెట్టాం అంటా; ఐ. ఎ. ఎస్. అవ్వాలని సంకల్పించాను అంటాం. 

అలా ఈ సంకల్పం అంటే  మన ఇచ్ఛ శక్తితో  కూడిన  ఆలోచన అనవచ్చు. ఇవి మనిషి  చేసుకునేవి. సంకల్పం ఎంత దృఢమైన సంకల్పం అయితే అంతా బాగా, అంతా త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది. 

ఈ సంకల్పం కాలానికి అతీతమైనది  కూడా. ఏ  సంకల్పమైన దాని  తీవ్రతను బట్టి, దృఢత్వయాన్ని  బట్టి, దాని  వెనుక ఉన్న తపస్సును  బట్టి దాని  శక్తి  ఆధారపడి ఉంటుంది. 

భౌతిక జీవనంలో సంకల్పాలు 

భౌతిక జీవనంలోని  సంకల్పాలు, మానవ మనుగడకు సంబంధించినవి. అవి వ్యక్తిగత మనుగడ కావచ్చు  లేక సామూహిక మనుగడకు  సంబంధించినవి  కావచ్చు. మనలోని  సంకల్పాలను   బట్టే  మన ఆలోచనలు, అలవాట్లు, ప్రవర్తన, వ్యక్తిత్వమూ, మన జీవితంలోని  నాణ్యతా ఆధారపడుంటాయి. 

భౌతిక జీవనంలో సంకల్పం చేసినంత మాత్రాన పనులు నెరవేరవు, సంకల్పానికి తగినటువంటి కృషి, శ్రమ అవసరం. ఆ  తరువాత సంకల్పించినది  సాధించడం జరుగుతుంది. కాబట్టి  భౌతిక, సాంసారిక జీవనంలో  ఏదైనా సాధించాలంటే, సంకల్పము, కృషి, సాధించడం; ఈ  మూడూ  ఉంటాయి. 

భౌతిక జీవనంలో సంకల్పాలు  చాలా  వరకు శారీరక, మానసిక వికాసానికి  సంబంధించినవై ఉంటాయి. 

ఆధ్యాత్మిక జీవనంలో సంకల్పాలు 

ఆత్మోన్నతి   కోసం, ఆత్మ వికాసం కోసం, మనిషి మరింత మరింత సమూలంగా మెరుగుపడటం కోసం సంపూర్ణ స్పృహతో  చేసే ప్రయత్నాంతో  కూడిన జీవనం ఆధ్యాత్మిక జీవనం. 

ఆధ్యాత్మిక జీవనంలో సంకల్పం చేసిన క్షణమే పనులు నెరవేరతాయి, ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ ఆధ్యాత్మిక రంగంలో సంకల్పం చేసిన వెంటనే సాధించడం ప్రారంభమైపోతుంది. సంకల్పం ఎంత స్వచ్ఛంగా, ఎంత స్పరార్థనా పూరితంగా, ఎంత శరణాగతి  భావంతో చేస్తే అంతా త్వరగా సాకారమవుతుంది.  కాబట్టి  భౌతిక, సాంసారిక జీవనంలో  ఏదైనా సాధించాలంటే, సంకల్పము, సాధించడం జరుగుతుంది; రెండే  ఉంటాయి. మరి సాధన ఎందుకు నెరవేరినప్పుడు అన్న ప్రశ్న రావడం సహజమే. 

ఆధ్యాత్మిక జీవనంలో  చేసే సంకల్పాలు సూక్ష్మ శరీరాలకు  సంబంధించినవి  కాబట్టి, ఈ  సంకల్పాలు  వీటిని  శుద్ధి  చేసే దిశగా ఉంటాయి కాబట్టి, ఇవి  దైవ సంకల్పానికి  అనుకూలమైన సంకల్పాలు  కాబట్టి వెంటనే  నెరతాయి. మనం  సాధన చేసేది దానికి  అనుకూలమైన బాహ్య వాతావరణం  కూడా ఏర్పరచుకునేందుకే. ఆ సంకల్పాల వల్ల నెరవేరిన సూక్ష్మ శరీరాల్లోని  ఫలితాలు  బాహ్యంగా ప్రకటమవడం కోసమేనాని  నా అవగాహన. 

సంకల్పాలు ఎప్పుడు నెరవేరతాయి?

అయితే మనం చేసుకునే సంకల్పాలు ఎప్పుడు  నెరవేరతాయి? అవి  భౌతిక జీవనానికి సమబంధించినవైనా, ఆధ్యాత్మిక సమబంధించినవైనా? ఈ  సంకల్పాలు  దైవ సంకల్పానికి అనుకూలంగా, శ్రుతిలో  ఉన్నప్పుడే నెరవేరడం జరుగుతుంది. అందుకే  మానవ ప్రయత్నం అంతా  కూడా మన సంకల్పాలు దైవసంకల్పానికి  అనుకూలంగా సవరించుకునే ప్రయత్నమే. దాని  కోసమే  ఆధ్యాత్మిఊక సాధన. మనసు  పవిత్రంగా శుద్ధంగా ఉంటే  తప్ప సంకల్పాలు  శుద్ధిగా  ఉండవు. మన సాధన అంతా  కూడా అంతఃకరణ శుద్ధి  కోసమే. అంతఃకరణ శుద్ధితో  చేసిన సంకల్పాలు, తక్షణమే  నెరవేరతాయి. మన జీవితాల్లో  కూడా గమనించవచ్చు. 

హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ సాధనలో సంకల్పాలు. 

ఆధ్యాత్మిక జీవనంలో చేసే సంకల్పాలు భౌతిక జీవనంలో  చేసే సంకల్పాలతో  పోలిస్తే  చాలా  స్థూలమైనవి. సంకల్పం ఎంత సూక్ష్మంగా ఉంటే అంత ప్రభావపూరితంగా ఉంటుందంటుంది ఆధ్యాత్మికం. మనిషిలో  సూక్ష్మత్వం ఎంత ఎక్కువగా ఉంటే  సంకల్పం అంత సమర్థవంతంగా పని చేస్తుంది. 

సంకల్పం గుండె లోలోతుల్లో సూక్ష్మ స్థాయిలో జరగాలి. మనలో సూక్ష్మత్వం పెరుగుతున్న కొద్దీ మన సంకల్పాలు  కూడా అంటే  ప్రభావాన్ని చూపిస్తాయి. 

సహజమార్గ సాధనలో మూడు ప్రధాన అంశాలు: 1) ధ్యానం 2) శుద్ధీకరణ 3) ప్రార్థన అనే 3 యౌగిక ప్రక్రియలు. 

ధ్యానంలో  మనం చేసే సంకల్పం: మన హృదయంలో  ఒక దివ్యమైన వెలుగు ఉంది, అది మనలను  లోపలికి  ఆకర్షిస్తున్నదన్న సంకల్పం. 

శుద్ధీకరణలో మనం చేసే సంకల్పం: మన శరీర వ్యవస్థలో  నుండి సమస్త మాలినాలు, జటిల తత్త్వాలు వెనుక భాగం నుండి పొగ లేక ఆవిరి  రూపంలో వెళ్లిపోతున్నాయన్న సంకల్పం. 

ప్రార్థనలో మనం చేసే సంకల్పం: భగవంతుడే మానవ జీవిత యదార్థ గమ్యమని, మన కోరికల బానిసత్వమే అక్కడికి  చేరుకోడానికి అవరోధమని, అక్కడికి  జేర్చగల శక్తి గాని, గురువు గాని  భగవంతుడేనని, భగవంతునికి శరణాగతి భావంతో, సంపూర్ణ నిస్సహాయ స్థితిలో చేసే సంకల్పం 

ఇవి గాక  ప్రతి సాధకుడు చేసుకోవలసిన 4 ప్రార్థనాపూర్వక సంకల్పాలు

1) ప్రతి ఒక్కరిలోనూ సరైన అవగాహన,  సరైన ఆలోచనా విధానం పెంపొందుతున్నదన్న సంకల్పం. 

2) చుట్టూ ఉన్న ప్రతీ వస్తువు  చెట్టు, పుట్ట, జంతువు, గోడ, పక్షి సర్వమూ  కూడా ఆయన స్మరణలో నిగణమై ఉన్నవన్న సంకల్పం. 

3) విశ్వంలోని  ప్రతీ  మానవుడి హృదయమూ ప్రేమతో  నిండి ఉన్నట్లు, అందరిలో  నిజమైన విశ్వాసం దృఢంగా మారుతున్నదన్న సంకల్పం. 

4) ఈ  సృష్టిలోని ప్రతీ  మానవుడు ఆ  మాస్టరు దృష్టికి, ఆ  మూలానికి  ఆకర్షితుడవుతున్నాడన్న సంకల్పం. 

పై చెప్పిన ఆధ్యాత్మిక సంకల్పాలపై మన దృష్టిని ఉంచిన క్షణమే వీటి ప్రభావం ప్రారంభమైపోతుంది. కేవలం హృదయపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా చేసుకోవాలసిన సంకల్పాలు అంతే.  





భక్త హనుమాన్ జయంతి

    భక్త హనుమాన్ జయంతి  హనుమజ్జయంతి ప్రతి సంవత్సరమూ చైత్ర శుక్ల పౌర్ణమినాడు ప్రపంచమంతటా ఉన్న హిందువులు జరుపుకుంటారు. శ్రీరామాయణ కావ్యంలో హను...