https://www.youtube.com/watch?v=9VeumJifoJY
సహజ మార్గ పద్ధతి యొక్క విశ్వజనీనత
సహజ మార్గ ధ్యాన ప్రక్రియలు విశ్వజనీనమైనవి, అంటే అన్నీ రకాల వ్యక్తులు అనుసరించగలిగేవి. ఎటువంటి అర్హతలూ చూడరు. కేవలం ప్రయత్నించడానికి సంసిద్ధత ఉండాలి అంటే. నమ్మకం, విశ్వాసం వంటివి కూడా అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసం అనుభవం ద్వారానే కలుగుతుంది గనుక. అనుభవం మానవ ప్రయత్నం ద్వారా మాత్రమే సాధ్యం.
ఎటువంటి విద్యార్హతలు గాని, ఎటువంటి నేపథ్యం గాని, కులమత రంగు, జాతీయతలతో సంబంధం లేదు. శాస్త్రజ్ఞులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, అంగవైకల్యం ఉన్నవారైనా, ఎవ్వరైనా ఈ ధ్యాన పద్ధతిని ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఈ ప్రక్రియలు హృదయ లోలోతుల్లోకి తీసుకువెళ్ళి మన చేతన స్థాయినే చేసిన ప్రతీశారీ మార్చగలిగే సామర్థ్యం ఉన్న పద్ధతి సహజ మార్గ ధ్యాన పద్ధతి. ఎవ్వరికైనా తెలియజేయవచ్చు, తనను తాను మార్చుకోవాలన్న తపన కలిగిన ప్రతీ వ్యక్తికి ఈ సాధన బాగా ఉపయోగపడుతుంది. మనసుకు అతీతంగా తీసుకువెళ్ళే ప్రక్రియలివి; సత్యాన్ని యథాతథంగా దర్శింపజేసి జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. తద్వారా జీవన ప్రమాణాలు, విలువలు సహజంగా ఉన్నతస్థాయిలో ఉండేలా చేస్తుంది. విలువలను నిజంగా గుర్తింపజేసి ఆ దిశలో జీవితాన్ని నడిపిస్తుంది ఈ మార్గం.
కాబట్టి ఇది అందరికీ అవసరం, ముందు మనం అనుభవాన్ని సాధించి, ఆ తరువాత అందరికీ తెలియజేయదగ్గ మార్గం, సహజ మార్గం. అవసరమైనడల్లా పరివర్తన కోసం తపించే హృదయం. అనుభవాన్ని పంచుకోవడం ద్వారానే దీన్ని ఇతరులకు తెలియజేయగలం.
అయితే ఈ సందర్భంలో పూజ్య చారీజీ అడిగిన ఒక ప్రశ్న గుర్తుకొస్తున్నది. ఒక ఆశ్రమంలో ఆయన మాట్లాడుతూ, సహజ మార్గ పద్ధతిని తెలియజేయాలంటే ఒక గ్రుడ్డి, మూగ, చెవుడు మూడూ ఉన్న వ్యక్తికి తెలియజేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఎప్పుడూ ఆలోచించలేదు, ఆశ్చర్యం వేసింది. దానికి వారు, యేమీ లేదు, ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ప్రశిక్షకుడు ప్రాణాహుతినివ్వడమేనన్నారు. అది హృదయాన్ని స్పృశిస్తుంది కాబట్టి జరగవలసిన ఆధ్యాత్మిక కార్యం జరుగుతుందన్నారు. అంతే కాదు, అన్నీ అవయవాలున్నవాళ్ళు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు గ్రుడ్డి, మూగ, చెవుడు ఉన్నట్లుగా కళ్ళు, చెవులు, నోరు మూసుకుంటే తప్ప, హృదయ గళాన్ని వినిపించుకోలేమని కూడా చెప్పడం జరిగింది. నిజంగా ధ్యానంలో జరిగేది అదే మనకు యేమీ కనిపించదు, వినిపించదు, మాట్లాడటం ఉండదు. అందరూ మననం చెయ్యవలసిన అంశం ఇది.