8, జులై 2024, సోమవారం

వివాహ వ్యవస్థ - 3

 


(సప్తపది)


వివాహ వ్యవస్థ - 3 
వివాహ వ్యవస్థలో, సనాతన ధర్మం ప్రకారం రకరకాలుగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. అతి ప్రసిద్ధమైన అందరూ సాధారణంగా అనుసరించే పద్ధతులు - మాంగల్య ధారణం, పాణిగ్రహణం, కన్యాదానం, సప్తపది, వీటిల్లో ఏదోక తంతు అయినా ఉంటుంది లేక అన్నీ కలిసి కూడా వివాహ మహోత్సవం జరుపుకుంటూ ఉంటారు. 
మాంగల్యధారణంలో , వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేయడం జరుగుతుంది; మూడు ముళ్ళకర్థం: స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు సంకేతం ఈ మూడు ముళ్ళు. మూడు  శరీరాలలోనూ ఇరువురూ ఒక్కటిగా ఉండాలన్నది ఆశయం.   
పాణిగ్రహణంలో వధువు చేయి, వరుడు చేతిలో పెట్టడం జరుగుతుంది. హార్ట్ఫుల్నెస్ సాంప్రదాయంలో సజీవ గురువు, గురుదేవులు, మాస్టర్,  సాన్నిధ్యంలో వధూవరులు, పూలదండలు మార్చుకున్న తరువాత (ముందుగా వధువు వరుడి మెడలో దండ వేస్తుంది, ఆ తరువాత వరుడు వధువు మెడలో దండ వేయడం జరుగుతుంది) వరుడు చేతిలో వధువు చేయి ఉంచి ఆశీర్వదించడం జరుగుతుంది. జీవితాంతం అలా ఒకరికొకరు కొనసాగాలని, వరుడు, వధువును ఆ విధంగా చూసుకోవాలని అర్థం. ఒక మహాత్ముని సమక్షంలో పాణి గ్రహణం చేయడం అనేది ఇరువురికీ అమితమైన బాధ్యతను సూచిస్తుంది. 
కన్యాదానం అంటే వధువు యొక్క తల్లిదండ్రులు తమ కుమార్తెను, కన్యను, వరుడిని మహావిష్ణువుగా భావించి, అంటే భగవంతునిగా భావించి తాము అపురూపంగా పెంచిపెద్దచేసిన కన్యను, అపరిమితమైన విశ్వాసంతో  ఆయన చేతిలో పెట్టి, అప్పుడప్పుడు వరుడి కాళ్ళు కడిగి (భగవంతుని పాదాలుగా భావించి), దానం చేయడం జరుగుతుంది. 
సప్తపది అనే నాల్గవ తంతులో అగ్నిహోత్రుని చుట్టూ, అగ్నిసాక్షిగా  వధూవరులిద్దరి చేత, అన్యోన్య దాంపత్యానికి అవసరమైన ఏడు వాగ్దానాలు, చేయిస్తారు.  కలిసి ఏడు అడుగులు వేస్తూ, అందుకే వీటిని సప్తపది అంటారు అంటే ఏడు అడుగులు వేస్తూ ఈ ప్రమాణాలు చేస్తారు. వీటినే పెళ్ళినాటి ప్రమాణాలు అని కూడా అంటారు. 
ఆ విధంగా వివాహ వ్యవస్థ ఒక పవిత్ర వ్యవస్థ, మానవ సమాజాన్ని క్రమశిక్షణలో ఉంచుతూ మనుగడకు ఉపయోగపడే మహత్తరమైన వ్యవస్థ. 
ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడూ, ఇది ఆలుమగలు పరిశుద్ధ ప్రేమతత్త్వాన్ని పెంపొందించుకునే అద్భుత వ్యవస్థ. తద్వారా ఆత్మసాక్షాత్కార దిశగా లేక భగవత్సాక్షాత్కార దిశగా తీసుకువెళ్ళేటువంటి పవిత్ర వ్యవస్థ. ప్రేమ, త్యాగాలను అనుభవపూర్వకంగా శిక్షణనిచ్చే వ్యవస్థ. రోజు-రోజుకూ మరింత మెరుగైన మానవుడిగా మారడానికి అనువైన, వీలుకల్పించే  శిక్షణాస్థలి, అద్భుత అవకాశం. ఇతరులను గురించి ఆలోచింపజేసే ఆశ్రమం గృహస్థాశ్రమం. 



6, జులై 2024, శనివారం

వివాహ వ్యవస్థ - 2

 


(కన్యాదానం)

వివాహ వ్యవస్థ - 2 
వివాహం నా అవగాహన ప్రకారం ఒక దైవ కార్యం; ప్రకృతి నిర్వహించే కార్యం; ప్రేమకు సంబంధించిన కార్యం. 
దైవ కార్యం ఎందుకంటే, రెండు ఆత్మలు సరైన సమయంలో ఎదురుపడటం అనేది సంభవించేది దివ్యపరిణామం వల్ల మాత్రమే. 
ప్రకృతి కార్యం ఎందుకంటే రెండు ఆత్మల సంస్కారాలను బట్టి ఒక్కచోటుకు జేర్చేది ప్రకృతి కాబట్టి, ఆ రెండు ఆత్మల కలయిక, ఆ తరువాత పునరుత్పత్తి, ఇత్యాది కార్యాలు ప్రకృతికి సంబంధించినవి కాబట్టి. 
వివాహం ప్రేమకు సంబంధించినది, ఎందుకంటే వైవాహిక జీవనంలోనే ప్రేమ, త్యాగం వంటివి నేర్చుకునేది. పరిశుద్ధ ప్రేమకు దారితీసే ఒక నిగూఢ వ్యవస్థ వివాహ వ్యవస్థ. 
పరిశుద్ధ ప్రేమ అంటే, భయము, క్రోధము, మోహము, ఈర్ష్య, అహంకారము, ఇత్యాది వికారాలు పూర్తిగా తొలగిపోయిన ఆత్మ స్థితి, శుద్ధ ప్రేమ అంటే. అన్ని ఆధ్యాత్మిక సాధనలు, చివరకు ఈ పరిశుద్ధ ప్రేమ స్థితికి చేరుకోవడానికే ; అదే పరమ లక్ష్యం. అది కానట్లయితే అట్టి సాధనా పద్ధతులను వెనువెంటనే విడిచి పెట్టేయాలి. 
పరిశుద్ధ ప్రేమకు దారితీసే జీవన విధానంలో వివాహ వ్యవస్థ ఒక కీలకమైన భాగం, ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యమైన అంగం. స్త్రీపురుష జీవనానికి సరైన దిశను ఏర్పరచేది ఈ వివాహ వ్యవస్థ. ఈ దిశ లేనట్లయితే, అది కేవలం పాశవిక జీవనంగా మిగిలిపోతుంది. 
వైవాహిక జీవితం యొక్క ప్రగాఢ ప్రాముఖ్యతను మనిషి జీవితంలో గుర్తించి, తదనుగుణంగా ఆలుమగలు తమ జీవితాలను సరిదిద్దుకోవడం, మానవాళి శ్రేయస్సుకు మంచిది. దీనికి హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ ధ్యాన విధానం వంటి జీవన విధానం అనుసరించినట్లయితే, మానవ వికాసం త్వరితగతిని జరిగే అవకాశం చాలా ఉంది. 

1, జులై 2024, సోమవారం

వివాహ వ్యవస్థ - 1

(పాణి గ్రహణం)

వివాహ వ్యవస్థ - 1 

వివాహం అవసరమా? వివాహం చేసుకోవాలా, అక్కర్లేదా? అసలు వివాహ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు, ఎలా మొదలయ్యింది? వివాహం చేసుకుంటే ఆడపిల్లలు యే వయసులో చేసుకోవడం శ్రేష్ఠం? మగ పిల్లలకు యే వయసు శ్రేష్ఠం?  వివాహం అయ్యాక వైవాహిక జీవనం శ్రేష్ఠంగా గడపాలంటే ఎలా? వైవాహిక జీవనానికి సముచిత అర్థం ఉండాలంటే ఏమి చేయాలి? 

ఈ ప్రశ్నలన్నీటికీ సమాధానాలు ఎవరికి వారు వెతుక్కుని, సంతృప్తికరమైన సమాధానాలు వచ్చే వరకూ జీవితాంతమూ తెలుసుకుంటూనే ఉండటం కొనసాగుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అందరికంటే గొప్పగా మనిషికి తెలియజేసేది సాక్షాత్తూ జీవితమే, ప్రకృతే. కానీ జీవితం నేర్పిస్తే చాలా కఠినంగా నేర్పిస్తుంది, చాలా సమయము, జీవితమూ  రెండూ  వ్యర్థం అవుతాయి కూడా. అందుకే మనం పెద్దల విజ్ఞతను, వారిచ్చిన జ్ఞానాన్ని,  అనుసరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూంటాము; కానీ ఎక్కడో అక్కడ మన తెలివితేటలు, మనలో ప్రతీదానికీ కారణం వెతుక్కునే తత్త్వం అడ్డు వస్తూనే ఉంటుంది. 

నా జీవితానుభవంలోనూ, పెద్దల మాట వినడంలోనూ , స్వంతంగా జీవితం నేర్పిన పాఠాల ద్వారానూ, సహజ మార్గ గురువుల బోధల ద్వారానూ, ఇప్పటి వరకూ తెలుసుకున్నది పంచుకునే ప్రయత్నం చేస్తాను, ఇక్కడ. 

పురుషులు సృష్టింపబడినది భర్తలవడానికి, స్త్రీలు జన్మించినది తల్లులుగా మారడానికేనని ఎక్కడో చదివినట్లు గుర్తు.  అప్పుడే వాళ్ళ జీవితం సార్థకం అవుతుంది. మానవజాతిని పునరుత్పత్తి చేసి వృద్ధి చేయడం, సమాజం పట్ల మానవులు చెయ్యవలసిన  కర్తవ్యం. ఇది వివాహ ధర్మం.  

(సశేషం ... )

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...