నిశ్శబ్దం
శబ్దం అంటే సంస్కృతంలో తరంగం అని అర్థం. ఆంగ్లంలో వైబ్రేషన్ అంటారు. ఈ సృష్టిలో, పరికించి చూసినట్లయితే ప్రతీదీ శబ్దమే, ప్రతీదీ వైబ్రేషనే. సృష్టే ఒక శబ్దం, ప్రతీ జీవి ఒక శబ్దమే, మాట శబ్దం, భాష శబ్దం, అణువు శబ్దం, పరమాణువు శబ్దం, పదార్థం శబ్దం, ఆలోచన శబ్దం, ఉద్వేగం శబ్దం, భావం శబ్దం, కోరిక శబ్దం, వికారాలు శబ్దాలు ఇలా అన్నీ శబ్దాలని అర్థం అవుతుంది. ఈ శబ్దాలు కొన్ని బాహ్యంగా ఉన్నాయి, కొన్ని అంతరంగంలో ఉన్నాయి.
మరి నిశ్శబ్దం అంటే ఏమిటి? బహుశా ఈ శబ్దాలన్నీటినీ దాటిన స్థితి అయి ఉండాలి, శబ్దాతీత స్థితి. అందులో నుండే ఈ శబ్దాలన్నీ ఆవిర్భవించి ఉండవచ్చు. నిశ్శబ్దం అంటే శూన్యమా? శూన్యంలో కూడా ఓంకార శబ్దం వినిపిస్తుందంటారు మన మహర్షులు. బహుశా అస్సలు యే శబ్దమూ పరమ శూన్య స్థితి కూడా ఉందేమో. అదే మనం అనుకునే దైవత్వం కావచ్చు. సమస్తానికి మూలం. అటువంటి అస్సలు శబ్దం లేని నిశ్శబ్దమే భగవంతుని బాష అని మన మాస్టర్లు అంటూ ఉంటారు.
మరి ఈ నిశ్శబ్దాన్ని అనుభూతి చెందగలమా? అంటే తప్పకుండా అనుభూతి చెందవచ్చునంటారు మన మహర్షులు, మహాత్ములు. దానికి ధ్యాన సాధనే మార్గం. బాహ్య శబ్దాలను కొంత వరకూ తగ్గించుకోవచ్చు. అంతరంగ శబ్దాలను (ఆలోచనలు, ఉద్వేగాలు, కోరికలు, వికారాలు, సంస్కారాలు) తగ్గించుకోవడం కష్టసాధ్యమే. మనలో చాలా మందిమి ఇక్కడే ఇరుక్కుపోయి ఉన్నాం.
అయితే వీటిని, ఈ అంతరంగ శబ్దాలను (గోలను) తగ్గించుకునే ఉపాయం ఏమిటి? బాబూజీ చెప్పిన చక్కని సరళమైన ఉపాయం: హృదయంలో దివ్యవెలుగు ఉంది అనే భావనపై ప్రాణాహుతి అనే దివ్యశక్తితో కూడిన ధ్యానం చేయమన్నారు. అటువంటి ధ్యానం వల్ల కలిగిన ధ్యానస్థితిని ఆస్వాదిస్తూ సాధ్యమైనంత ఎక్కువ సమయం నిలుపుకోమన్నారు. నెమ్మదిగా, క్రమక్రమంగా మనసు లక్షణమే సూక్ష్మంగా మారుతుంది. నిజమైన నిశ్శబ్ద స్థితి అనతికాలంలోనే అనుభూతి చెందగలుగుతారు. ఈ నిశ్శబ్ద శితి యొక్క స్పర్శ మొట్టమొదటి రోజు నుండి అనుభూతి చెందడం కొంతమంది గమనించగలుగుతారు.
కాబట్టి ధ్యానం ద్వారానే గాకుండగా మనందరమూ ప్రయత్న పూర్వకంగా లోపల, బయట కూడా నిశ్శబ్దాన్ని పాటించడానికి ప్రయత్నించినట్లయితే మన జీవితంలో అనేక సమస్యలకు పరిష్కార మార్గంగా పరిణమించడం మనం గమనించగలుగుతాం. ఈ నిశ్శబ్దానికి అతీతమైన దివ్యవెలుగు దిశగా చేసే యాత్రే ఆధ్యాత్మిక యాత్ర.