20, ఆగస్టు 2025, బుధవారం

కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక పదాలు - వాటి అర్థాలు

 


కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక పదాలు - వాటి అర్థాలు 

అనంత ఆధ్యాత్మిక సాహిత్యంలో మనం తరచూ కొన్ని పదాలు చదువుతూ ఉంటాం. కొన్నిటికి అర్థాలు తెలిసినట్లనిపిస్తుంది; కొన్నిటికి అస్పష్టంగా అర్థం తెలుస్తూ ఉంటుంది; కొన్నిటికీ అర్థం తెలియక ఓయినా చదవడం కొనసాగిస్తూ ఉంటాం. ఫలితంగా మన అవగాహణలో కొరతలు ఉన్నాయని మనకే అర్థమవుతూ ఉంటుంది. ఈ పరిస్థితిని సాధ్యమైనంత వరకూ తగ్గించుకునే ప్రయత్నంలో ప్రతీ సాధకుడూ ఉండాలి. అటువంటి కొన్ని పదాలను ఇక్కడ పరిశీలిద్దాం. 
శరీరాలు 3
స్థూల శరీరం: భౌతికంగా కనిపించే శరీరం; ఇందులో ఉన్న వివిధ అవయవాలు, ఎముకలు, మాంసము, రక్తము, నరాలు, నాడులు, చర్మము ఇత్యాదివన్నీ స్థూల శరీరంలోకి వస్తాయి.   
సూక్ష్మ శరీరం: 19 సూక్ష్మ శరీరాలు - 5 కర్మేంద్రియాలు (పాద, పాణి, పాయు (మల ద్వారం), వాక్, ఉపాస్థ(మర్మేంద్రియాలు) ) , 5 జ్ఞానేంద్రియాలు (కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం), 5 వాయువులు(ప్రాణ, అపాన, వ్యాన ఉదాన, సమాన వాయువులు), మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. వీటిల్లో ప్రధానమైనవి మనసు, బుద్ధి, అహంకార్యము, చిత్తము.  వీటన్నిటినీ కలిపి సూక్ష్మ శరీరం అంటారు. 
కారణ శరీరం: పై మూడు శరీరాలు ఒకదానికొకటి సంబంధం గలవి. పై రెండు శరీరాలకు బీజం వంటిది కారణ శరీరం. అందుకే దీన్ని కారణ శరీరం అంటారు. స్థూల శరీరం పడిపోయిన తరువాత కొనసాగేది ఈ శరీరమే. ఇందులోనే అన్ని జన్మల సంస్కారాలు బీజరూపంలో ఉంటాయంటారు. దీన్నే కొందరు ఆత్మ అని కూడా అంటారు; మరికొందరు ఆత్మ వేరు, కారణ శరీరం వేరు అంటారు. కారణ శరీరానికి ఆవల ఆత్మ విడిగా ఉందని కొందరు నమ్ముతారు. యేది ఏమైనప్పటికీ మానవ లోకాన్ని, ఉన్నత లోకాలను అనుసంధానం చేసేది ఈ కారణ శరీరం. 
హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ కు సంబంధించినంత వరకూ సూక్ష్మ శరీరాలు ప్రధానంగా 4 - మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము (లేక చైతన్యము). 
మనసు - హృదయము 
మనసు పనే ఆలోచించడం; మనసు ఆలోచనల పుట్ట. మరి హృదయం అంటే ఏమిటి? తెలుగు భాషలో వాడుక భాషలో మనసున్న మనిషి అంటే మంచి హృదయం ఉన్న మనిషి అని అర్థం; మంచి మైండ్  ఉన్న మనిషి అని కాదు. సంస్కృతంలో మనస్ అంటే ఆలోచించే శక్తి. ఆధ్యాత్మిక సాహిత్యం చదివేటప్పుడు మనస్సు అన్నప్పుడు మనస్ (మైండ్) అనే అర్థం చేసుకోవాలి. 
మనస్ కి హృదయానికి తేడా ఏమిటి అని పూజ్య దాజీని అడిగినప్పుడు, ఆయన, మనస్, హృదయము  ఒకే వస్తువుకున్న  రెండు కొనలు వంటివి అని చెప్పడం జరిగింది. 
మనసు - బుద్ధి 
మనసు ఆలోచిస్తుంది; ఆలోచించే శక్తి. బుద్ధి ఆలోచనల్లోని మంచి-చెడు విచక్షణ చేసి నిర్ణయాలు తీసుకునే శక్తి. 
బుద్ధి - అహం 
బుద్ధి నిర్ణయం తీసుకుంటే, అమలు చేసేది అహం. కాబట్టి అహం మనిషికి అవసరం. 
అహం -అస్మిత 
అహం తగినంత మోతాదులో ఉంటే దాన్ని అస్మిత అంటారు. అంటే మనిషికి ఉన్నతికి ఉపయోగకరమైన శక్తి. మనిషి మనుగడకు అవసరమైనది.  మోతాదు మించినప్పుడు అది అహంకారంగా మారుతుంది. మనిషికి అవరోధమవుతుంది. మోతాదుకు మించి మరీ ఎక్కువైనప్పుడు దురహంకారం అవుతుంది. దురహంకారం ఆత్మవినాశనానికి దారి తీస్తుంది. 
చిత్తము, చిత్ లేక చైతన్యము 
చిత్తము లేక చిత్ సరోవరం ఆజ్ఞా చక్రానికి వెనుక ఒక అంగుళం లోతులో ఉందని పూజ్య దాజీ చెప్పడం జరిగింది. ఇక్కడే నుండే ఆలోచనల ప్రవాహం హృదయం వైపు ప్రవహిస్తాయి. ఇక్కడే సంస్కారాల బీజాలు కూడా ఉండేది. చిత్ అంటే చైతన్యం కూడా. ఇందులోనే మనస్, బుద్ధి, అహం అనే సూక్ష్మ శరీరాలు ఇమిడి ఉన్నాయి. అందుకే మనస్, బుద్ధి, అహంకారాలు శుద్ధి జరిగినప్పుడు చైతన్య శుద్ధి కూడా జరిగి, మనిషిలో సమూల మార్పులు రావడం ప్రారంభిస్తాయి.  

18, ఆగస్టు 2025, సోమవారం

శ్రీకృష్ణ జన్మాష్టమి - 2025

 


శ్రీకృష్ణ  జన్మాష్టమి - 2025 

ఈ సంవత్సరం శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థ ప్రధాన కార్యాలయం అయిన హైదరాబాదులోని కాన్హా శాంతి వనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని ఆధ్యాత్మిక శోభతో ఎంతో ఘనంగా ఆధ్యాత్మిక భాండారాతో సమానంగా జరుపుకోవడం జరిగింది. కొన్ని వేలమంది అభ్యాసులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, కొన్ని వేల మంది ప్రత్యక్షంగా లైవ్ లో వీక్షించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో పూజ్య దాజీ ధ్యానం నిర్వహించక పూర్వం, ముఖ్య అతిథిగా  విచ్చేసిన, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రస్తుత సర్ సంఘ్ సంచాలక్ గా వ్యవహరిస్తున్న శ్రీమాన్ మోహన్ భాగవత్ గారు, పూజ్య దాజీ మనవిపై ఒక అద్భుత ప్రసంగం చేయడం జరిగింది. 

  ఈ సందర్భంగా పూజ్య దాజీ పలికిన పలుకులు ఇలా ఉన్నాయి: 
".... హార్ట్ఫుల్నెస్ సంస్థ ఏకైక లక్ష్యం భూమ్మీద ఉన్న ప్రతీ ఇంట్లోనూ ధ్యానం జరగాలని, ప్రతీ హృదయం ధ్యానించాలన్నదే". "2025 వ సంవత్సరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నూరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  ఈ సంస్థ ఒక విస్తృతమైన, పరిపక్వమైన, నిస్స్వార్థ సంస్థ; గత నూరేళ్ళుగా ఎందరో యువకులు వివాహం కూడా చేసుకోకుండా, ఎంతో క్రమశిక్షణతో, అంకితభావంతో, దేశ ప్రగతి కోసం సేవలో నిమగ్నమై ఎన్నో ఎన్నెన్నో త్యాగాలు చేసిన ఒక పటిష్ఠమైన సంస్థ" అంటూ మోహన్ భాగవత్ గారిని మన సంస్థ అభ్యాసులకు మార్గదర్శనం చేయమని, ఈ రోజు యొక్క ప్రాశస్త్యం గురించి మాట్లాడి ప్రేరణ కలిగించాలని కోరడం జరిగింది.
ఈ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు:
శ్రద్ధేయ  దాజీ ముందుంచిన వారి భావాలకు సమాధానాలన్నీ,  మనం శ్రీకృష్ణ భగవానుడి జీవిత చరిత్ర నుండి, మచ్చలేకుండా వారు జీవించిన విధానం  నుండి, వారి వివేకం నుండి, వారి వాణి నుండి మనం పొందవచ్చు. శ్రీకృష్ణుడికి జీవితం అంతా ఆ విధంగా జీవించేటువంటి శక్తి ఎలా అచ్చయింది? ఇనో విషమ పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. యేదైనా పని యశశ్విగా చేయాలంటే  ఎలాగో భగవద్గీతలో చెప్పడం జరిగింది:  1) అధిష్ఠానం: అందరిలో ప్రేమ ఉంది; ఆ ప్రేమను నిరంతరం అనుభూతి చెందడం ఆవసరం; ఈ ప్రేమను ఆధారంగా చేసుకొని జీ వించడమే అధిష్ఠానం; ధ్యానం యొక్క లక్ష్యం కూడా ఆదేనని నుకుంటూ ఉంటాను; ఎందుకంటే ధ్యాన స్థితితో ఎప్పుడూ కూడి ఉండే ప్రయత్నంలో ఉంటాం గనుక. యే తత్త్వంతో అయితే సర్వమూ కలిసి ఉన్నాయో, ఆ ఒక్క తత్త్వం యొక స్మరణలో నిరంతరం అనుభూతి చెందడమే కదా ధ్యానం అంటే. ఆ అధిష్ఠానమే భగవంతుడంటె. యోగః కర్మసు కౌశలం. ఆ భగవంతునితో అనుసంధానం కలిగి ఉంటూ కర్మ చేయడం. యేం చేసావన్నది ప్రధానం కాదు; ఏ విధంగా చేశావన్నదే ముఖ్యం.    2) కరణం - అంటే కార్యం చేసే పద్ధతి. సరైన విధంగా పనులు చేస్తే సరైన ఫలితాలు వస్తాయి. పద్ధతి ప్రకారం చేస్తే పనులు సరిగ్గా అవుతాయి. శ్రీకృష్ణ భగవానుడు చేయడం గాక పాండవుల చేత చేయించేవాడు, కీర్తి వాళ్ళకి కట్టబెట్టేవాడు. ఆయన పరమ యోగేశ్వరుడు, అన్నీ ముందే తెలిసినవాడు; అయినా ఉదాహరణగా నిలుస్తూ అందరి చేత కారమను చేయియించేడు; కర్మ యోగం నేర్పించాడు. సమర్థుడైనా కూడా ఒక క్రమశిక్షణలో ఉండవలసి వస్తుంది; ధర్మం అనే క్రమశిక్షణ అందరికీ ఉంది. 
               
            अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् |
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ||

వెరసి మన జీవితం విజయవంతంగా కాదు, అర్థవంతంగా ఉండాలన్నారు. 
 

15, ఆగస్టు 2025, శుక్రవారం

సమృద్ధ భారత్



సమృద్ధ భారత్ 

మన త్రివర్ణ పతాకం 79 వ భారత స్వాతంత్ర్య దినోత్సా సందర్భంగా కనుల విందుగా రెపరెపలాడుతున్నది. గర్వంగా భారతీయులందరూ జైహింద్ అంటూ సెల్యూట్ చేస్తున్నారు. 

ఎందరో మహానుభావులు, ఎందరో దేశభక్తులు ఎన్నెన్నో త్యాగాలు చేస్తే లభించిన స్వాతంత్ర్యం. అందరినీ కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకోవలసిన రోజు. అదే సమయంలో ఈ రోజు మన ప్రధాన మంత్రి, ఢిల్లీలో ఎర్రకోటపై  జాతీయ పతాకం ఎగురవేస్తూ ప్రతీ ఒక్క భారతీయునికి ఇచ్చిన పిలుపును మనసు నిండా నిలుపుకొని సమృద్ధ భారత్ దిశగా కృషి చేయాలన్న సంకల్పం చేసుకోవలసిన రోజు. ఎవరి తోడ్పాటును వారందించాలన్న సంకల్పం చేసుకోవలసిన రోజు. 

ఇందుకు ప్రతీ ఒక్కరూ తమలో దేశభక్తిని పెంపొందించుకునేందుకు, నిత్యస్ఫూర్తితో జీవించేందుకు ప్రతి ఒక్కరూ తప్పక స్వామి వివేకానంద వ్యక్తిత్వంపై, వారి జీవిత చరిత్రను అధ్యయనం చేయవలసి ఉంది. వారి జీవిత ప్రారంభ దశలో దేవుడెక్కడున్నాడు? దేవుడిని చూశారా? అని కనిపించిన ప్రతి ఒక్కరినీ అడిగేవారు. అలా ఆధ్యాత్మికపరంగా సర్వమూ విదితమైన తరువాత చివరి సంవత్సరాలలో దేశం గురించి మాత్రమే ప్రసంగించేవారు. అమెరికా వెళ్ళి షికాగోలో కోడి అయి కూసి భారతీయులను మేలుకొల్పారు. వారి స్ఫూర్తి ఫలితంగా స్వాతంత్ర్య ఉద్యమం ఊపందుకుంది. ఎందరో ప్రేరితులై క్రియాన్వితులయ్యారు. ఫలితంగా ఈ రోజు మనం సుఖ శ్వాసలను పీల్చుకుంటున్నాం. ఆధునిక భారతంలో మరలా ఈ దేశభక్తి సమృద్ధి దిశగా కృషి చేయడానికి కనిపించకుండా పని చేస్తున్న ఎందరో మహాత్ములున్నారు. దేశభక్తి ద్వారానే దైవప్రాప్తి సాధ్యంఅని చాటిన మహానీయులెందరో! 


 

14, ఆగస్టు 2025, గురువారం

హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ - సంస్కారాలు -2

 


హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ - సంస్కారాలు -2

మనకి (మన అహానికి) , మనలో ఉన్న అంతర్యామికి మధ్య అడ్డుగోడలుగా, అవరోధాలుగా ఉండి అంతర్యామితో సంపర్కం లేకుండా చేసేవి - 
1) ఈ సంస్కారాలు/కర్మలు/వాసనలు లేక జటిలతత్త్వాలు(సంక్లిష్టతలు), అశుద్ధాలు(మలినాలు), 
2) కోరికలు, 
3) అహం. 
మన శాస్త్రాల ప్రకారం కర్మలు 3 రకాలు - సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు.  
ప్రారబ్ధం: ప్రారబ్ధ కర్మ అంటే సంచిత కరమలోని కొంత భాగాన్ని ఈ జన్మలో అనుభవించడం. అంటే వదిలేసిన బాణం అన్నమాట. వెనక్కి తీసుకోటానికి ఉండదు. అనుభవించవలసిందే. 
సంచితం: ఈ జన్మలోనే గాక, పూర్వ జన్మల్లో గతంలో మన చేతల ద్వారా, మన ఆలోచనల ద్వారా మట్టం మనం చేసిన కర్మల భాండాగారం. అంటే అమ్ములపొదిలో ఉన్న బాణాలన్నమాట. ఇవి మనలో బీజరూపంలో మన ఊక్ష్మ శరీరాల్లో స్థితమై ఉంటాయట. వీటిని హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతి ద్వారా ప్రాణాయాహుతి సహాయంతో దగ్ధం చేయడం జరుగుతుంది. బీజ్ దగ్ధ్    అంటారు బాబూజీ. అందుకే అభ్యాసయి సహకరిస్తే ఒకే జన్మలో మోక్షం కలిగే అవకాశం.  
ఆగామి: ఆగామి కర్మ అంటే చేతిలో ఉన్న బాణం, మనం భవిష్యత్తులో అనుభవించవలసిన కర్మలు. చేతిలో ఉన్న బాణాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. 
ఈ 3 రకాల కర్మలు సంపూర్ణంగా నశిస్తే గాని ఆత్మకు మోక్షం ఉండదు - సంచిత కర్మ ప్రాణాహుతి ద్వారా నాశిస్తుంది; ప్రారబ్ధ కర్మ అనుభవించడం ద్వారా నశిస్తుంది; ఆగామి కర్మ ఇంకా అమలు గాకుండాగానే నాశనం అయ్యే అవకాశం ఉంది. అటువంటి జీవన విధానమే హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ జీవన విధానం.  

యోగదర్శనం ప్రకారం 3 రకాల అవరోధాలున్నాయి - మల, విక్షేప, ఆవరణలు. ఇవి మనం ఏర్పరచుకునే, ఇప్పటికే  ఏర్పరచుకున్న అవరోధాలు.
మల (అశుద్ధం): కామ క్రోధ ఇత్యాది అరిషడ్వర్గాల వల్ల, ఇతర వాసనల వల్ల మనసు, హృదయము మలినమైపోవడం. 
విక్షేప: మనసు అస్థిరంగా ఉండటం, ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు దూకడం, చంచలంగా ఉండే తత్త్వం. రజో గుణం వల్ల కలిగే ఫలితం. ధారణ-ధ్యానాదులకు మనసు అవరోధంగా మారడం, బాహ్య వస్తువుల వెంటపడటం. 
ఆవరణ: అంటే అతి సూక్ష్మమైన, అతి లోతైన అవరోధం, ఆత్మను ఆవరించిన ఆవిద్యా, అజ్ఞానం, అతి సూక్ష్మమైన పొర. బంధానికి మూల కారణం. తమో గుణం వల్ల జనించినది. ఆవరణాలను తొలగించడం అతి కఠినం. మనసు ప్రశాంతంగా తయారైనప్పటికీ కూడా, ఆత్మ సాక్షాత్కారానికి అడ్డు పడుతుంది. ఈ ఆవరణలను సమర్థుడైన గురువు మాత్రమే, ప్రాణాహుతి శక్తిని ప్రసరించ గల గురువు మాత్రమే తొలగించగలడు. 



13, ఆగస్టు 2025, బుధవారం

హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ - సంస్కారాలు -1

 


హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ - సంస్కారాలు -1 
*
సహజ్ మార్గ్ పరిభాషలో సంస్కారాలంటే ఏమిటి? 
మామూలుగా సంస్కారం లేదా? అని వాడుకలో సరైన అలవాట్లను కనబరచకపోతే, అవతలివాళ్ళను అంటూంటాం. ఇక్కడ సహజ్  మార్గ్ సందర్భంలో సంస్కారాలంటే అవి కాదు. 
సంప్రదాయపరంగా వేటినైతే కర్మలని, వాసనలని, పూర్వజన్మల సంస్కారాలని కూడా వాడుతూ ఉంటామో అవే సంస్కారాలు. 

సంస్కారాలు ఎలా ఏర్పడతాయి? 
'నేను' చేస్తున్నానన్న స్పృహతో చేసిన కర్మలు, ఆలోచనలు ముద్రలుగా మనసులో ఏర్పడతాయి. అవే కర్మలు, ఆలోచనలు, మరలా-మరలా పునరావృతమైనప్పుడు అవి కరుడు కట్టి, ప్రవృత్తులుగా మారతాయి. వీటినే సంస్కారాలంటారు. మనసులో ఈ సంస్కారాలు ఏర్పడటమే గాక, అవి బుద్ధిని శాసిస్తాయి కూడా. అందుకే బుద్ధి కర్మానుసారిణి అన్న నానుడి వచ్చింది. బుద్ధి కర్మను అనుసరిస్తుంది; మనం బుద్ధిని అనుసరిస్తాము; అందుకే మన జీవితం కూడా మనం కర్మను అనుసరించే ఉంటుంది. కాని బుద్ధి హృదయాన్ని అనుసరించాలి. ఆశిక్షణయనే ధ్యాన శిక్షణ అని అంటాం.  ముందు ముద్రలుగా ఏర్పడి, ఆ ముద్రలే సంస్కారాలుగా మారతాయి. 

సంస్కారాలు 4 రకాలు
నిత్యం మనం బాహ్య ప్రపంచంతో వ్యవహరిస్తున్నప్పుడు 4 రకాలుగా ఈ సంస్కారాలను ఏర్పరచుకుంటూ ఉంటాం - 1) ఇష్టాలు-అయిష్టాలు (రాగద్వేషాలు) 2) ఇంద్రియ సుఖాలకు సంబంధించిన ముద్రలు 3) సాంసారిక చింతలు (ఈతి బాధలంటాం) 4) అపరాధభావం (గ్లాని) - చేయవలసినవి చేయకుండా ఉండటం, చేయకూడనివి చేయడం వల్ల కలిగే ముద్రలు.  

9, ఆగస్టు 2025, శనివారం

ఆధ్యాత్మిక సాధనలో ప్రశ్నల పాత్ర, ప్రాముఖ్యత

 


ఆధ్యాత్మిక సాధనలో ప్రశ్నల పాత్ర, ప్రాముఖ్యత
 
జీవుడు భూమ్మీద పడిన తరువాత, ఊహందుకున్నప్పటి నుండి మనసులో ఎన్నో ప్రశ్నలను ఎదుర్కొంటూ ఉంటాడు. అందులోనూ మాటలు వచ్చినప్పటినుండి, ముఖ్యంగా పసితనంలో చుట్టూ ఉన్న పెద్దవాళ్ళను ప్రశ్నలతో ముంచెత్తి తాను ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు జీవుడు. స్పష్టమైన ప్రశ్నలు, ఆసక్తికరమైన ప్రశ్నలు, అర్థం లేని ప్రశ్నలు అన్నీ ఉంటాయి ఆ ప్రశ్నల్లో. దీన్నే మనం జిజ్ఞాస అంటాం. జీవుడు ఎదిగేది ఈ జిజ్ఞాసతోనే.  కొన్ని ప్రశ్నలకు సమాధానాలొస్తాయి, కొన్నిటికి రావు, కొన్ని ప్రశ్నల వల్ల అవతలి వాళ్ళు సమాధానాలు చెప్పలేక, వాళ్ళ కోపానికి గురవ్వాల్సి వస్తూ ఉంటుంది.  అప్పుడు ఆ ప్రశ్నలకు అణచివేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎదుగుతున్న కొద్దీ సాంసారిక సమస్యలతో సతమవుతూ , వాటిల్లో చిక్కుకుపోయి సంసార సంబంధమైన ప్రశ్నలకే పరిమితమైపోతూ ఉంటాం. అసలు జిజ్ఞాస తగ్గిపోతూ ఉంటుంది. అదృష్టవశాత్తు ఈ జిజ్ఞాస పూర్తిగా తగ్గిపోదు. ఈ జిజ్ఞాస మనిషి ప్రాణాలకు ప్రయాణం పోస్తున్నట్లనిపిస్తుంది.
 
ఇక ఆధ్యాత్మిక జిజ్ఞాసను యేదో విధంగా కాపాడుకోగలిగినవాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే ఆ జిజ్ఞాస ఈ జన్మ యొక్క సమస్యే కాదు, అన్ని జన్మల సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి దారి తీసే అవకాశం ఉంది. 

అయితే ఈ సంసారంలో ఈదుతూనే మనసులో కలిగే ఆస్తిత్వపరమైన ప్రశ్నలకు జీవుడు సమాధానాలు/పరిష్కారాలు  తనదైన రీతిలో అన్వేషిస్తూ ఉంటాడు. ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ఈ అన్వేషణ, ఆధ్యాత్మిక సాధనకు దారి తీయవచ్చు. చిన్నప్పటి నుండి మనకు అలవడిన, ఈ ప్రశ్నించుకునే తత్త్వం ఇప్పుడు ఊపందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధ్యానలోలోతుల్లోకి వేడుతున్న కొద్దీ ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి, వాటికి తిరుగులేని సమాధానాలు కూడా అంతరాత్మ నుండి అందుతూ ఉంటాయి. దానితో ఆత్మ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, ధ్యానం నిగూఢ స్థితులకు చేరుకుంటూ ఉంటుంది; దీనికి అంతం ఉండదు.
 
అంతరంగంలో నుండి గాక ఈ ప్రశ్నలకు సమాధానాలు మరే మార్గాల ద్వారా వచ్చే అవకాశం ఉంది? 
శాస్త్రాల నుండి, ఉద్గ్రంథాల నుండి, మహాత్ముల ప్రసంగాల నుండి, గురువులతో ప్రశ్నోత్తరాల నుండి మన హృదయం ప్రతిస్పందించినప్పుడు జరుగుతుంది. 

నిజమైన గురువు అసలైన ప్రశ్నలు ఎవరైనా శిష్యుడు అడుగుతాడేమోనని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడట? అటువంటి ప్రశ్నలు అడిగేవారికే గాక ఇతరులకు కూడా పరిష్కారమే ఆడు, ముక్తికి దారి తీసే ఉంటాయట. 

మరి అడిగే ప్రశ్నలు ఎలా ఉండాలి? సాధారణ నియమాలు: 
1) ప్రశ్నలు ఇతరులను బాధపెట్టేవిగా ఉండకూడదు. 
2) ప్రశ్నలు జిజ్ఞాసతో కూడినవై ఉండాలి.  
3) ఊహాజనితమైన ప్రశ్నలు వేయరాదు.  
4) అడిగే ప్రశ్నలు మన ఆధ్యాత్మిక అన్వేషణకు సంబంధించి, మన ప్రగతికి ఉపయోగపడే విధంగా ఉండేలా చూసుకోవాలి. 
5) ప్రశ్నలు సాధ్యమైనంత క్లుప్తంగా, సూత్రప్రాయంగా ఉండాలి.
6) సత్యానుభూతి దిశగా ఉండాలి ప్రశ్నలు 

ప్రశ్నలు ఇతరుల ద్వారా తెలుసుకున్నా, గ్రంథాలయ ద్వారా తెలుసుకున్నా, తనం అంతఃకరణను అడిగి తెలుసుకున్నా అవి మన ధ్యాన లోతులను పెంచుతాయి. మరొక ముఖ్య విషయం ఆధ్యాత్మికతలో సమాధానాల కంటే కూడా ప్రశ్నలే చాలా ముఖ్యం, సమాధానం లేకపోయినా సరే. ఇవే మన శోధన శక్తిని పెంపొందిస్తాయి, ధ్యాన లోలోతుల్లోకి వెళ్ళడానికి ఎంతో తోడ్పడతాయి. 

ఇక సమాధానాల విషయానికొస్తే, కొన్ని సమాధానాలు వెంటనే వస్తాయి కొన్ని శ్రమించగా శ్రమించగా వస్తాయి, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వేచి ఉండవలసి ఉంటుంది, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని జన్మలు కూడా పట్టే ప్రశ్నలున్నాయి. ఆధ్యాత్మికతలో ప్రశ్నలకు సమాధానాలు కోరేవారు తొందరపడకూడదు, అపరిమితమైన సహనాన్ని అలవరచుకోవాలి. సమాధానం కోసం వేచి ఉండటం వల్ల తపన తీవ్రమవుతుంది. 

మన శాస్త్రాలను గమనించినా కూడా మనం కనుగొనేది, భగవద్గీత, వశిష్ఠ గీత, అష్టావక్ర గీత, ఉపనిషత్తులు, వంటి శాస్త్రాలననిటిల్లోనూ కూడా గురుశిష్యుల మధ్య ప్రశ్నోత్తరాలే కనిపిస్తాయి. వీటిల్లో మనకొచ్చే ప్రశ్నలకు, మనకు రాబోయే ప్రశ్నలకు, కూడా సమాధానాలున్నాయి. "నా పుస్తకాలు ఎవరూ చదవడం లేదు, అందులో మీకు వస్తున్న ప్రశ్నలకు, రాబోయే ప్రశ్నలకు కూడా సమాధానాలున్నాయి" అని పూజ్య చారీజీ అంటూండేవారు. ప్రస్తుతం పూజ్య దాజీ అభ్యాసీలు అడిగే ప్రశ్నలకు ప్రాధాన్యతనిస్తూ దిల్ సే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

కాబట్టి ప్రశ్నల్లేకుండా ఆధ్యాత్మిక శోధన అసంభవం. శ్రేష్ఠమైన సమాధానాలు లోపలి నుండి అంతరాత్మ నుండి వచ్చేవే. వాటినే అంతర్ప్రబోధాలంటారు.  

8, ఆగస్టు 2025, శుక్రవారం

పుష్ప విలాపం

 


పద్మశ్రీ ఘంటశాల గారు గానం చేసీన పుష్పవిలాపాన్ని వినడానికి పైన క్లిక్ చెయ్యండి 

పుష్ప విలాపం
కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి)


నీ పూజ కోసం పూలు కోసుకు వద్దామని
ప్రొద్దుననే తోటలోనికి వెళ్ళాను ప్రభూ.
ఉదయశ్రీ అరుణారుణ కాంతులలో
ఉద్యానం కళకళలాడు తున్నది.
పూల బాలలు
తల్లి వొడిలో అల్లారు ముద్దుగా
ఆడుకుంటున్నాయి. అప్పుడు,

**
నే నొక పూలమొక్క కడ నిల్చి
చివాలున కొమ్మవంచి
గోరానెడు నంతలోన
విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి
"మా ప్రాణము దీతువా"
యనుచు బావురు మన్నవి;
కృంగిపోతి;
నా మానస మందదేదో
తళుకు మన్నది
పుష్పవిలాప కావ్యమై.
** 
అంతలో, ఒక సన్నజాజి కన్నియ
తన సన్నని గొంతుకతో నన్ను జూచి
ఇలా అన్నది ప్రభూ.

** 
ఆయువు గల్గు నాల్గు ఘడియల్
కని పెంచిన తీవతల్లి
జాతీయత దిద్ది తీర్తుము;
తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము;
ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము
ఆయమ చల్లనికాలి వ్రేళ్ళపై.

** 
ఎందుకయ్యా మా స్వేచ్ఛభిమానాని
కడ్డు వస్తావ్?
మేం నీకేం అపకారం చేశాం?
గాలిని గౌరవింతుము సుగంధము పూసి;
సమాశ్రయించు భృంగాలకు
విందు చేసెదము కమ్మని తేనెలు;
మిమ్ము బోంట్ల నేత్రాలకు
హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల
స్వార్ధ బుద్ధితో,
తాళుము, త్రుంప బోవకుము;
తల్లికి బిడ్డకు వేరు సేతువే!

** 

ఇంతలో ఒక గులాబి బాల కోపంతో ముఖమంతా
ఎర్రజేసుకుని ఇలా అన్నది ప్రభూ.
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండేలొనుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు

పాపం, మీరు దయా దాక్షిణ్యాలు గల మానవులు
గాబోలునే !
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ
మరంద మాధురీ జీవిత మెల్ల
మీకయి త్యజించి కృశించి నశించిపోయె;
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ
మరంద మాధురీ జీవిత మెల్ల
మీకయి త్యజించి కృశించి నశించిపోయె;

మా యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి
చీపురుతోడ చిమ్మి
మమ్మావల పారబోతురు గదా! నరజాతికి
నీతి యున్నదా !
ఓయి మానవుడా !
బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నా
హృదయకుసుమాన్ని గైకొని
నాపై నీ కరుణశ్రీ రేఖలను
ప్రసరించుము ప్రభూ!
ప్రభూ!


7, ఆగస్టు 2025, గురువారం

సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు - 2

 


సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు - 2

ధృతిః క్షమా దమః ఆస్తేయం శౌచమింద్రియనిగ్రహః
ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం.
తాత్పర్యం: 
ధృతి (ధైర్యం), క్షమా, దమ, దొంగిలించకుండుట, శుచి, ఇంద్రియనిగ్రహము, సద్బుద్ధి,  విద్య, సత్యము, కోపము లేకుండుట, ఈ పదీ ధర్మ లక్షణాలు.   

 

అద్భిర్ గాత్రాణి శుద్ధ్యంతి మనః సత్యేన శుధ్యంతి,
విద్యాతపోభ్యాం భూతాత్మా బుద్ధిర్ జ్ఞానేన శుద్ధ్యంతి.
తాత్పర్యం:
శరీరాన్ని నీరు శుద్ధి చేస్తుంది, మనస్సు సత్యము చేత శుద్ధి చేయబడుతుంది, విద్య తపస్సుల చేత ఆత్మశుద్ధి జరుగుతుంది, బుద్ధి జ్ఞానము చేత శుద్ధి అవుతుంది. 
 
ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి.

తాత్పర్యం:

ఆకాశం నుండి నీరు క్రిందకు పడి, యే విధంగా సముద్రం చేరుకుంటుందో, అదే విధంగా దేవతలందరికీ చేసే నమస్కారాలన్నీ కూడా ఆ కేశవుడినే చేరుతాయి. 


దుర్లభం త్రయం ఏవ ఏతత్ దేవానుగ్రహ  హేతుకం
మనుష్యత్వం  ముముక్షత్వం మహాపూషః సమాశ్రయః. 

తాత్పర్యం:
దైవానుగ్రహం లేనిదే ఈ మూడు విషయాలు లభించడం దుర్లభం - మానవ జన్మ, భగవంతుని కోసం తపన, ఒక మహాపురుషుని ఆశ్రయం. - ఆది శంకరాచార్య, వివేకచూడామణి 

జరా  రూపం  హరతి, ధైర్యమాశా, మృత్యుః ప్రాణాన్, ధర్మచర్యామసూయా,
క్రోధః శ్రియం, శీలమనార్యసేవ, హ్రియం  కామః, సర్వమేవాభిమానః. 

తాత్పర్యం:
వృద్ధాప్యం రూపాన్ని హరిస్తుంది,  ఆశ ధైర్యాన్ని హరిస్తుంది, మృత్యువు ప్రాణాలను హరిస్తుంది, ధర్మంగా ఉండే నడవడిని అసూయ హరిస్తుంది, కోపం ప్రతిష్ఠను హరిస్తుంది, సౌశీల్యం దుష్ట సాంగత్యాన్ని హరిస్తుంది, సిగ్గు కామాన్ని హరిస్తుంది, దురహంకారం సర్వాన్నీ హరిస్తుంది. 


యత్ర నార్యస్తు  పూజ్యంతే రమంతే  తత్ర దేవతాః,
యత్ర ఎతాః న పూజ్యంతే  సర్వాస్తత్రాఫలాః క్రియాః.
తాత్పర్యం:
ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు నివసిస్తారు; ఎక్కడ స్త్రీలు పూజింపబడరో అక్కడ న్నీ వైఫ్యల్యానికే దారి తీస్తాయి. - మనుస్మృతి 


కేయూరాణి న విభూషయంతి పురుషం; హారా న చంద్రోజ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః; వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే; క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం.

 తాత్పర్యం:
ఆత్మను కేయూరాలతో (పూలతో) అలంకరించలేము, స్నానం ద్వారా గాని, సుగంధముల చేత గాని, జుట్టును కూమయాల ద్వారా అలంకరించడం ద్వారా గాని ఆత్మకు అలంకారం చేయలేము. వాణిలో సంస్కృతం ఉంటేనే ఆత్మను అలంకరించగలం; ఎప్పటికీ నాశనం లేనిది, ఈ వాక్కుకు ఆభరణంగా ఉండేది ఈ సంస్కృతమే. 

ఓమ్ త్రయంబకం యజామహే సుగంధిం                            పుష్టివర్ధనంఉర్వారుకమివ బంధనాన్                                మృత్యోర్ముక్షీయమామృతాత్  


తాత్పర్యం:
త్ర్యంబకం అంటే మూడు కన్నులవాడిని యజామహే పూజిస్తున్నాము; ఆధ్యాత్మిక సౌరభంతో భాసిస్తూ మా ఆధ్యాత్మిక అంతరాళానికి పుష్ఠి కలిగించాలని ప్రార్థిస్తున్నాం. 


కరాగ్రే వసతే  లక్ష్మి, కరమధ్యే  చ సరస్వతి,
కరమూలే తు  గోవింద, ప్రభాతే  కరదర్శనం.
తాత్పర్యం:
అరచేతి అంచులో లక్ష్మీ, అరచేతి మధ్యలో సరస్వతి, అరచేతి మూలలో గోవిందుడు, ఉన్న కర దర్శనాన్ని ఉదయాన్నే చేసుకుంటున్నాము. 


ఉద్యమేన హి సిద్ధ్యంతి  కార్యాణి న మనోరథైః
న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే  మృగాః
తాత్పర్యం:
శ్రమించడం ద్వారా మాత్రమే కార్యాలు సిద్ధిస్తాయి; కేవలం కోరుకున్నంత మాత్రాన సరిపోదు. సింహం నోట్లోకి మృగం యే విధంగా తనంతట అదే ప్రవేశించదో, సింహం యే విధంగా వేటాడా వలసి ఉంటుందో, అదే విధంగా మనిషి శ్రామిస్తే గాని పనులు సిద్ధించవు. 

మూకం కరోతి  వాచాలం పంగ్ ఉల్లంఘయతే  గిరింయత్కృపా తమహం వందే  పరమానందమాధవం.

తాత్పర్యం:

పరమానందానికి నిలయమైన భగవంతుని కృప ఉన్నట్లయితే, మూగవాడు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, కాళ్ళు లేనివాడు కొండలు చక చకా ఎక్కగలుగుతాడు. 

ఓమ్ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య  పూర్ణ  మాదాయ  పూర్ణామేవావశిష్యతే.

తాత్పర్యం:
భగవంతుడు పరిపూర్ణుడు. ఈ ప్రపంచం పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన ఈ ప్రపంచం భగవంతుడి నుండే పుట్టింది. పరిపూర్ణత నుండి పరిపూర్ణాతను తీసివేసినా  పరిపూర్ణతే మిగిలి ఉంటుంది. 

 



తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7

  కరీంనగర్ ఆశ్రమంలో ఆవులు 2020  తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7 పూజ్య దాజీ ప్రసాదించిన మరో వరం. కరీంనగర్...