జీవితంలో ఏది సాధించాలన్నా తపన లేనిదే సాధ్యం కాదు. తపన ఎంత తీవ్రంగా ఉంటే గమ్యం లేక మన లక్ష్యం అంత చేరవవుతుంది. ఇది అన్నీ విషయాల్లోనూ వర్తిస్తుంది. అతిముఖ్యంగా ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకోవడానికి, లేక అనుకున్న ఆశయాన్ని సాధించడానికి లేక మానవ పరిపూర్ణతను సాధించడానికి చాలా అవసరం.
ఆధ్యాత్మిక తపన అనేది మనలో ఉండే ఒక వెలితి వల్ల వస్తుంది; ఒక ఖాళీ వల్ల వస్తుంది; ఒక అసంపూర్ణ భావం వల్ల కలుగుతుంది; ఒక అశాంతి ఏర్పడుతుంది; ఇదే గమ్యానికి జేర్చే ఇంధనం. ఇదే మనం అహంకారం సృష్టించే తుచ్ఛమైన అవరోధాలను తొలగించేది కూడా. ఇదే మనలో ఉన్న తత్త్వ వేత్తను వెలికి తీసేది కూడా.
ఉదాహరణకు సిద్ధార్థుడు అప్పటి వరకూ ఏ కష్టమూ ఎరగకుండా జీవించినవాడు, ఒక రోజున, ఒక శవాన్ని చూసి, ఒక వ్యాధిగ్రస్తుడిని చూసి, ఒక వృద్ధుడిని చూసి, తీవ్ర వేదనకు లోనై మనిషి ఈ విధంగా కష్టాలకు లోనవడానికి మూలకారణం ఏమిటో తెలుసుకోవాలన్న తపన బయల్దేరి, ఆ కారణం తెలుసుకునే వరకూ ఆయన మనసులో మరేదీ లేకుండా పరిష్కారాన్ని కనుగొని, గౌతమ బుద్ధుడవుతాడు. ఇలా కొన్ని సంఘటనల వల్ల కొందరిలో తీవ్ర తపన కలుగవచ్చు.
మరో ఉదాహరణ శ్రీరామకృష్ణ పరమహంస. వారిలో తపన ఎలా ఉండేదంటే, ప్రతీ రోజూ రాత్రి చీకటి పడగానే "అయ్యో భగవంతుని సాక్షాత్కారం గాకుండగానే మరో రోజు గడచిపోయిందే!" అని రాత్రుళ్ళు విలపిస్తూ ఉండేవారట. అదీ వారి తపన. అలా రామకృష్ణ, శ్రీరామకృష్ణ పరమహంసగా మారడం జరిగింది.
ఇక ఆయన శిష్యుడు స్వామి వివేకానంద తపన ఎలా ఉండేది? అతి పిన్న వయసులో అసలు భగవంతుడు ఉన్నాడా లేదా? అని తెలుసుకోవాలనుకున్నాడు; ఉంటే ఎవరైనా చూశారా? అటువంటి వ్యక్తి కోసం విపరీతమైన శాంతితో కనిపించిన వ్యక్తిని "నువ్వు దేవుడిని చూశావా?" అని ప్రశ్నించేవారట. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే వరకూ ఆయనకు నిద్ర పట్టేది కాదట; అటువంటి తీవ్ర తపనే నరేంద్రుడిని శ్రీరామకృష్ణ పరమహంస వద్దకు చేర్చింది. స్వామి వివేకానందుడిగా పరివర్తన చెందడం జరిగింది.
లక్ష్యాన్ని బట్టి తపన తీవ్రత అవసరమవుతుంది. కొన్ని లక్ష్యాలకు ఎక్కువ తపన అవసరం ఉండదు. కానీ మానవ వికాసం, భగవంతునితో పరిపూర్ణ ఐక్యం, ఆధ్యాత్మికోన్నతి, మోక్షప్రాప్తి, కర్మరాహిత్యం వంటి పరమ సూక్ష్మ లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు అతి తీవ్రమైన తపన అవసరమవుతుంది లేకపోతే మనం చేపట్టిన సంకల్పం పూర్తవకుండానే ఆగిపోతుంది.
కాబట్టి ఆధ్యాత్మిక యాత్రలో మనలను నడిపించవలసినది, నడిపించేది తపన మాత్రమే. తపన ఏ విధంగా ఉండాలంటే దారిలో ఉండే కలుపుమొక్కలను, అవరోధాలను దగ్ధం వేసే విధంగా ఉండాలి.
అటువంటి తపన ప్రతీ వ్యక్తి ఆత్మలోనూ నిక్షిప్తమై ఉంది. ప్రతీ ఆత్మలోనూ ఉంది; అది వివిధ రకాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది - డబ్బు కోసం, పేరు కోసం, ప్రతిష్ఠ కోసం, అధికారం కోసమూ, ఇలా అనేకరకాలుగా మనిషిలో వ్యక్తమవుతూ ఉంటుంది. అయినా ఇవేవీ మనిషికి సంతృప్తినివ్వవు. స్వతః సిద్ధంగా ఉండే తపన తన మూలాన్ని చేరుకొనే వరకూ ఆ ఆత్మ విశ్రమించదు. పడుకోనివ్వదు. సాధారణంగా నిద్రాణ స్థితిలో ఉంటుంది.
మనిషికి అస్తిత్వానికి సంబంధించిన కష్టాలు ఎదురైనప్పుడు సాధారణంగా తన మూలాలను తెలుసుకునేందుకు ఆరాటపడటం మొదలవుతుంది; ఇంచుమించు పునాదులు కదిలే విధంగా పరిస్థితులు తటస్థమైనప్పుడు ఇటువంటి ప్రశ్నలు ఆత్మలో తలెత్తి, వాటికి సమాధానం దొరికే వరకూ పరితపిస్తూ ఉంటుంది ఆత్మ. అటువంటి తపనే తనకనువైన ఆధ్యాత్మిక మార్గానికి లేదా మార్గదర్శనం చేసే గురువు వద్దకు దారి తీస్తుంది. అదే గమ్యాన్ని చేరుకొనే వరకూ కూడా ఆత్మను నడిపిస్తుంది కూడా.
అయితే సహజంగా ప్రతీ ఆత్మలోనూ నిక్షిప్తమై ఉన్న ఈ తపనను పెంచుకోవచ్చు కూడా. అది ధ్యానం వల్ల సాధ్యం. ఆధ్యాత్మికతలో త్వరితంగా గమ్యం చేరడానికి ఇంధనం లాంటిది ఈ తపన. ధ్యానంలో నిమాగ్నమైన కొద్దీ గమ్యానికి చేరువవుతున్న అనుభూతి ఆత్మకు కలగడం వల్ల గమ్యాన్ని చేరుకోవాలన్న తపన రోజురోజుకూ పెరుగుతూ ఉంటుంది. గమ్యం చేరుకుంటున్నానన్న విశ్వాసం మరీ మరీ పెరుగుతూ ఉండటం వల్ల మనలో వికాసం జరగడం కూడా గమనిస్తూ ఉంటాం.
అన్నిటికంటే అతివిచిత్రమైన విషయం ఏమిటంటే, ఆత్మ పడే తపనను, పరమాత్మ ఆత్మ కోసం పడే తపనతో పోలిస్తే అస్సలు పోల్చలేనంత తీవ్రంగా ఉంటుందని ఒకసారి బాబూజీ చెప్తారు.
తపన తీవ్రతరం చేసుకోవడానికి గ్రంథాలు చదవడం వల్ల గాని, సత్సాంగత్యం వల్ల గాని, ధ్యానం వల్ల గాని, స్వార్థం లేకుండా కర్మ చేయడం వల్ల గాని, చింతన వల్ల గాని, సేవ వలన గాని, వీటన్నిటి వల్ల గాని పెరగవచ్చు. తపన అంటే ఆధ్యాత్మిక ఆకలి; ఆ ఆకలి ద్వారా ఆ పరమాత్మను ఆత్మ స్మరిస్తూ ఉంటుంది; అందుకే ఆ తపన ఎంత తీవ్రంగా ఉంటే తన ప్రియతముడైన పరమాత్మను అంతా త్వరితంగా చేరుకుంటుంది.
భగవంతుని కోసం నిజమైన తపన ఎలా ఉంటుందంటే, నీటిలో మునిగిపోతున్నవాడు ప్రాణం కోసం ఏ విధంగా పరితపిస్తాడో, అలా ఉంటుందట. అటువంటి తపన సాధకుడిని గమ్యానికి త్వరితంగా చేరుస్తుంది.
సహజంగా ప్రతీ ఆత్మలోనూ నిక్షిప్తమై ఉన్న ఈ తపనను సాధకుడు, సత్సాంగత్యం ద్వారా, ఆధ్యాత్మిక గ్రంఠా ధ్యయనం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, ధ్యానం ద్వారా, గురువుల శుశ్రూష ద్వారా, స్వచ్ఛంద సేవ ద్వారా మరింతగా రగిలేలా చేసుకోవచ్చు.
అందుచేత అటువంటి ఆధ్యాత్మిక ఆకలిని, తపనను, ఆధ్యాత్మిక తృష్ణను, అందరూ విపరీతంగా పెంచుకుందురుగాక! అటువంటి తీవ్ర తపనతో ఎప్పుడూ మన హృదయాలు నిండి ఉండుగాక!