23, మే 2023, మంగళవారం

సరళత్వం


సరళత్వం 

బాబూజీ  "భగవంతుడు సరళుడు" అని చెప్పడం జరిగింది. అంతే కాదు, భగవంతుని  చేరే  మార్గం  కూడా సరళంగానే  ఉండాలన్నారు. మనం కూడా సరళంగా తయారైతే గాని  వారిలో సంపూర్ణ ఐక్యం సాధ్యపడదన్నారు. భగవంతునితో  సంపూర్ణంగా సాయుజ్యం పొందడమే యోగసాధన యొక్క పరమలక్ష్యం. 

అయితే  ఈ  సరళత్వం అంటే  ఏమిటి? సరళంగా తయారవడం ఎలా? ఇవి  సాధకుడి  ముందున్న ప్రశ్నలు. దీనికి హార్ట్ఫుల్నెస్ మాస్టర్లు ఏమి చెబుతున్నారో  చూద్దాం. 

భగవంతుడు సరళుడు. అంటే ఎటువంటి వికారాలూ  లేనివాడు, ఎటువంటి గుణాలూ  లేనివాడు, ఎటువంటి ఆకారమూ  లేనివాడు, ఎటువంటి జటిలత్వమూ  లేనివాడు. అదే సరళత్వం. అంటే  మనం భగవతత్త్వాన్ని గురించి మాట్లాడుతున్నాం; భగవతత్త్వం సరళం. ఊహకందనిది; కానీ  హృదయ లోలోతుల్లో అనుభూతి చెందగలిగినది. మాటల్లో  వర్ణించలేనిది. అందుకే  ధ్యానం; అదే  ఏకైక మార్గం. 

ఏ కారణాల వల్లయితేనేమి, జటిలంగా తయారైన మానవుడు  ఆ విధంగా సూక్ష్మంగా,  సరళంగా మారితే  తప్ప అతనికి  నిజమైన మనుగడ లేదు, ఎదుగుదల లేదు, ఆధ్యాత్మిక పురోగతి లేదు, మానవ జన్మ సార్థకత లేదు, తృప్తి లేదు. ఎందుకంటే అతనిలో ఉండే ఆత్మ యొక్క అసలు ప్రకృతి ఇదే. అందుకే  దాని  కోసం పరితపిస్తూ  ఉంటుంది. ఆ  అంతిమ స్థితిని  చేరుకునే  వరకూ అశాంతిగానే  ఉంటుంది.  

మనిషిని జటిలంగా తయారు  చేసినవేమిటి? ప్రధానంగా కోరికలు, సంస్కారాలు, అహంకారము; వీటి వల్ల కలిగినవే  చింతలు, భయాలు, లోభమోహమదమాత్సర్యాలు. ఇవే  మనలో  జటిల తత్వాలను సృష్టిస్తాయి. ఇవన్నీ మనలో అదృశ్యంగా ఉండి మనలను వేధిస్తూ ఉంటాయి. మన సమతౌల్యతకు  భంగం వాటిల్లేలా చేస్తాయి; వీటిని తొలగించాలన్నా, తీవ్రత తగ్గించాలన్నా, నియంత్రించాలన్నా అంత సూక్ష్మమైన మార్గం కావాలి; అదే ప్రాణాహుతి అనే దివ్యశక్తి ప్రసరణతో  కూడిన ధ్యానము, శుద్ధీకరణ అనే యౌగిక ప్రక్రియలు. శుద్ధీకరణ ద్వారా జటిల్యతత్త్వాలు  పోయి సరళంగా తయారవుతాం అంటారు  పూజ్య దాజీ. 

సరళంగా మారడానికి మనిషిగా పైనుండి  మనం చేయగలిగిన ప్రయత్నం: మనకు కోరికలు, అవసరాలు అని రెండుంటాయి; అవసరాలు ఉనికికి మౌలికమైనవి; కోరికలు  మనం సృష్టించుకున్నవి. సరళంగా తయారవ్వాలంటే ముందు  కోరికలను  తగ్గించుకొని, అవసరాలకే  పరిమతమయ్యే  జీవితాన్ని  గడపాలి; ఆ తరువాత అవసరాలు  కూడా తగ్గించుకోవాలంటారు పూజ్య చారీజీ. 

అటువంటి పరమ సరళ స్థితిని సాధించిన వ్యక్తి యొక్క చేతనావస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, బాబూజీ తన స్థితిని  గురించి  ఒక సందర్భంలో చెప్పిన వాక్యం పై  ధ్యానించవలసిన అవసరం ఉంది: "నేను 'నేను' అన్నప్పుడు అది నా గురుదేవులను  సూచిస్తున్నడో, లేక ఆ భగవంతుడిని సూచిస్తున్నడో  లేక నన్ను సూచిస్తున్నడో నాకు  తెలియదు" అన్నారు  బాబూజీ. 


భక్త హనుమాన్ జయంతి

    భక్త హనుమాన్ జయంతి  హనుమజ్జయంతి ప్రతి సంవత్సరమూ చైత్ర శుక్ల పౌర్ణమినాడు ప్రపంచమంతటా ఉన్న హిందువులు జరుపుకుంటారు. శ్రీరామాయణ కావ్యంలో హను...